పుర, నగరపాలక సంస్థల్లో, నగర పంచాయతీల్లో భారీగా పెంచిన ఆస్తి పన్నుపై ప్రజల ప్రశ్నలకు ప్రభుత్వం జవాబు చెప్పాలని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసత్య హామీలు, నిత్య మోసాలపై ప్రజలకు క్షమాపణలైనా చెప్పాలన్నారు. ‘మీకు ఓట్లేసిన పాపానికి ప్రజలకు ఇన్ని పాట్లా...ఇదేం బాదుడు, ఇదేం పాలన?’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. ‘ప్రభుత్వ పన్ను పోటు పట్ల సగటు మనిషి ఆవేదన’ పేరుతో విజయవాడకు చెందిన ఒక వ్యక్తి ట్వీట్ చేసిన వాయిస్ రికార్డు మెసేజ్‌ను జత చేస్తూ బుధవారం ఆయన దానిని రీ ట్వీట్ చేశారు.
ఆ వాయిస్ రికార్డు మెసేజ్‌లో ఏమి ఉందంటే...
50% పన్ను పెంపునకు ప్రాతిపదిక ఏమిటి? ప్రజల జీవన ప్రమాణాల స్థాయి పెరగనప్పుడు పన్నులు ఎలా పెంచుతారు? అంటూ విజయవాడకు చెందిన ఒక మధ్యతరగతి వ్యక్తి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ట్వీట్ చేసిన మెసేజ్..
అందరికీ నమస్కారం...మధ్యతరగతి వ్యక్తి ఆలోచన ఎలా ఉంటుందంటే...వంద రూపాయల పన్ను కడతావా? రూ.ఐదు డిస్కౌంట్ ఇస్తాను తగ్గించి రూ.95 కడతావా అంటే.. తిన్నా, తినకపోయినా ఇతర అవసరాలు ఉన్నా...అవన్నీ పక్కనపెట్టి రూ.95 పన్ను కట్టడానికి మొగ్గు చూపుతారు. విషయం ఏమిటంటే.. ఈ నెలాఖరులోగా ఇంటి పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ఇస్తామని విజయవాడ నగరపాలక సంస్థ ఇటీవల ఒక ప్రకటన చేసింది. ఒక మధ్యతరగతికి చెందిన ఒక వ్యక్తిగా.. డిమాండ్ నోటీసు ఇవ్వకపోయినా...నగరపాలక సంస్థ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆ నోటీసు డౌన్‌లోడ్ చేశాను. అందులో రూ.5,700 చెల్లించాలని చూపించింది. గత ఏడాది రూ.3,600 కట్టాను. ఒకేసారి ఇంత ఎందుకు పెరిగిందని అదే సైట్‌లోని డీసీబీ రిపోర్టు చూశాను. అందులో ఏడు హెడ్లు కనిపించాయి.
*మొదటిది జనరల్ టాక్స్. రెండోది చెత్త పన్ను...మా ఇంటి ముందే పెద్ద చెత్త కుప్ప ఉంది. అంతా వచ్చి అక్కడ చెత్త వేస్తుంటారు. ఇందుకు చెత్త పన్ను వేశారా? శుభ్రం చేసి కదా.. చెత్త పన్ను వసూలు చేయాలి!
*మూడోది డ్రైనేజీ పన్ను. మా ఇంటి ముందు చిన్న కాలువలో నిండా చెత్తే ఉంటుంది. దోమల బెడదతో గత ఏడాది నా భార్యకు డెంగీ జ్వరం వస్తే వారం పాటు ఆసుపత్రిలో వైద్యం చేయించాను.