ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించిన తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి తీరును.. వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు ఖండించారు. దీనికి బాధ్యున్ని చేస్తూ.. పట్టాభిని తక్షణమే పార్టీ నుంచి బహిష్కరించాలని.. లేదంటే ముఖ్యమంత్రి జగన్ కు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మారుతీ నగర్ జంక్షన్ వద్ద శుక్రవారం జనాగ్రహ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం నాయకులు ఎవరూ ఇకపై ప్రజల్లో తిరగలేరని అన్నారు.
తెదేపా చేస్తున్నవి దొంగ దీక్షలు..
తెలుగుదేశం పార్టీని కాపాడుకునేందుకే.. ఆ పార్టీ నాయకులు కుట్రలు చేస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖమంత్రి శంకరనారాయణ ఆరోపించారు. సంతోషంగా ఉన్న ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకే.. దొంగ దీక్షలు చేస్తున్నారని అన్నారు. తెదేపా చేస్తున్న దీక్షల్ని ప్రజలు నమ్మరని అన్నారు మంత్రి. అనంతపురం జిల్లా పెనుకొండలో వైకాపా చేపట్టిన జనాగ్రహ దీక్ష రెండవ రోజుకు చేరింది. ఈ దీక్షలో పాల్గొన్న మంత్రి శంకరనారాయణ.. తెదేపాపై విమర్శలు గుప్పించారు.