అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు (Amaravathi Framers Maha Padayatra) వస్తున్న ప్రజాదరణ చూసి సీఎం జగన్ (Cm jagan) భయపడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) దుయ్యబట్టారు. అందుకే హైకోర్టు ఆదేశాలను (High court Orders) సైతం బేఖాతరు చేస్తూ..పోలీసుల సాయంతో పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. శాంతియుతంగా సాగుతున్న పాదయాత్రలో రైతులు, మీడియా ప్రతినిధులపై పోలీసులు లాఠీ ఛార్జ్ (Police Lathi Charge) చేయటం దుర్మార్గమన్నారు. పాదయాత్రకు ప్రజల మద్దతు లేకుండా చేసే కక్షసాధింపు చర్యల్లో భాగంగానే.. రహదారుల దిగ్భంధం, చెక్ పోస్టులు, బారికేడ్ల ఏర్పాటుతో అడ్డుతగులుతున్నారన్నారు. ప్రభుత్వ దమనకాండను, జగన్ అప్రజాస్వామిక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
అన్ని జిల్లాల సమగ్రాభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే అమరావతి నిర్మాణాన్ని నిలిపేసి 3 రాజధానులంటూ (Three Capitals in AP) జగన్ విధ్వంసకర రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు అనుమతితో సాగుతున్న మహాపాదయాత్రను అడ్డుకోవడం మాని, గాయపడిన రైతులకు మెరుగైన వైద్యసాయం అందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
మహాపాదయాత్రకు స్పందన చూసి సీఎం భయపడుతున్నారు. రైతుల పాదయాత్రకు ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోంది. రైతులు, మీడియా ప్రతినిధులపై పోలీసుల లాఠీఛార్జ్ దుర్మార్గం. రోడ్లు దిగ్బంధం, చెక్ పోస్టుల ఏర్పాటు.. కక్షసాధింపు చర్యలే. జగన్‌రెడ్డి అప్రజాస్వామిక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. 3 రాజధానులంటూ జగన్ విధ్వంసకర రాజకీయం చేస్తున్నారు. రైతుల పాదయాత్రపై కోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. గాయపడిన రైతులకు మెరుగైన వైద్యం అందించాలి.- చంద్రబాబు, తెదేపా అధినేత
ఏం జరిగిందంటే...
ప్రకాశం జిల్లా చదలవాడలో రైతుల పాదయాత్రలో (Amaravathi Framers Maha Padayatra) ఉద్రిక్తత నెలకొంది. రైతులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో సంతనూతలపాడుకు చెందిన రైతు నాగార్జున చేయి విరిగింది. ఉద్రిక్తత కారణంగా రైతుల పాదయాత్రకు అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధించారు. యాత్రలో పాల్గొనేందుకు పెద్దఎత్తున వస్తున్న ప్రజలను అడ్డుకుంటున్నారు. అయినప్పటికీ పోలీసులను తోసుకుంటూ ప్రజలు యాత్రలో పాల్గొంటున్నారు. భారీగా వచ్చి పాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్నారు. ఈ క్రమంలో గ్రామాల నుంచి ప్రజలు రోడ్లపైకి రాకుండా పోలీసులు రోడ్లు దిగ్బంధించి చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.