విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలని.. ప్రధాని మోదీని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కోరారు. ప్రధానికి 3 పేజీల లేఖ రాసిన చంద్రబాబు.. కర్మగారం చరిత్ర, ప్లాంటుతో ప్రజల అనుబంధాన్ని వివరించారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సంస్థ పరిరక్షణపై దృష్టి పెట్టాలని ప్రధానిని కోరారు. విశాఖ నగరం, స్టీల్ ప్లాంట్ అభివృద్ధి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయన్నారు. దేశంలో సముద్రతీరంలో ఉన్న ఏకైక ఉక్కు కర్మాగారంగా అనేక ప్రత్యేకతలు సంతరించుకుందన్నారు. 1966 నుంచి తెలుగు ప్రజల విరామం లేని పోరాట ఫలితమే విశాఖ ఉక్కు పరిశ్రమ అని గుర్తు చేశారు.
16 వేల కుటుంబాలు భూములిచ్చాయి
నాటి ఉద్యమంలో అమృతరావు నేతృత్వంలో విద్యార్థి లోకం అంతా ఏకమైన విషయాన్ని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. 32 మంది ప్రాణత్యాగాలు చేయగా పెద్దసంఖ్యలో ప్రజా ప్రతినిధులు పదవులు వదిలిపెట్టారన్నారు. 16 వేల కుటుంబాలు భూములు త్యాగం చేస్తే.. ఇంటికో ఉద్యోగం వాగ్దానం 8 వేల కుటుంబాలకే పరిమితమైందన్నారు. తెలుగు ప్రజల ఐక్యతకు చిహ్నంగా విశాఖ ఉక్కు నిలిచిందని చంద్రబాబు స్పష్టం చేశారు.