మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసారంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు డీజీపీ గౌతం సవాంగ్‌కు లేఖ రాశారు. కర్నూలు జిల్లాలోని బనగానపల్లి పోలీస్‌స్టేషన్‌లో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి అతని మద్దతుదారులపై అక్రమ కేసు బనాయించారని లేఖలో ఆరోపించారు. జనార్ధన్ రెడ్డిపై ఫిర్యాదు చేసిన వ్యక్తి, అతని అనుచరులైన వైకాపా గూండాలే దాడి చేయడానికి వెళ్లారన్నారు. జనార్ధన్ రెడ్డి, అతని మద్దతుదారులు వారిని ప్రతిఘటించినందుకు వారిపై అక్రమ కేసు నమోదు చేశారని లేఖలో పేర్కొన్నారు.
2021 మే 23వ తేదీ అర్ధరాత్రి అక్రమ అరెస్టులు చేశారన్న చంద్రబాబు.., అరెస్టు చేసిన వారిలో జనార్ధన్ రెడ్డి, మురళి, రమణలను 24 గంటల్లో కోర్టులో హాజరుపరిచారని తెలిపారు. కానీ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న మరో ఆరుగురు జనార్ధన్ రెడ్డి మద్దతుదారులను 24 గంటల్లో కోర్టులో హాజరుపరచలేదన్నారు. అరెస్టు చేసిన వ్యక్తిని 24గంటలలోపు కోర్టులో హాజరుపర్చాలనే నియమం ఉన్నప్పటికీ, చట్టవిరుద్ధంగా వారిని పోలీసు నిర్బంధంలో ఉంచారని ఆక్షేపించారు. వారిలో శ్రీను, దివాకర్, విజయ్ రెడ్డి, నరసింహ, పెద్దా హుస్సేని, అత్తర్ షాహిద్ లు ఉన్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగా ఇరికించటానికి.. బాధితులను బలవంతంగా ఒప్పించడానికి చట్టవిరుద్ధంగా ఆరుగురిని పోలీసు కస్టడీలో ఉంచినట్లు తెలుస్తోందన్నారు. ఇటువంటి అక్రమ నిర్బంధాలు చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం, ప్రజాస్వామ్య నిబంధనలకు విరుద్ధం, ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా పేర్కొన్నారు. అందువల్ల, అక్రమంగా అదుపులోకి తీసుకున్న తెదేపా నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో ఇటువంటి అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు చేయకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డీజీపీని విజ్ఞప్తి చేశారు.
కేసులు పెట్టడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుంది