సంక్షేమం పేరుతో ముఖ్యమంత్రి జగన్ (cm jagan) మోసం చేశారని తెదేపా అధినేత చంద్రబాబు (chandra babu) విమర్శించారు. ఇచ్చింది గోరంత, దోచింది కొండంత అని ధ్వజమెత్తారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించిన ఆయన.. సీఎం జగన్ అవినీతిపై క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.
కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్లో (vaccination) ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆక్షేపించారు. వారం రోజులు టీకాలు వేయకుండా ఒక్కరోజు వేసి ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. మట్టి, ఇసుక, మద్యం, మైనింగ్ మాఫియాలతో రెచ్చిపోవటంతో పాటు ఇళ్ల నిర్మాణం, భూ కొనుగోళ్లలో పెద్దఎత్తున అవినీతి జరిగిందని ధ్వజమెత్తారు.
"అసమర్థత, అబద్ధాల పాలనతో యువత భవిష్యత్తు ప్రమాదంలో పడింది. పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇవ్వనందున నిరుద్యోగ యువత భవితవ్యం ప్రశ్నార్థకమైంది. జాబ్ క్యాలెండర్ (job calendar) పేరిట ఉద్యోగాలు లేని క్యాలెండర్ విడుదల చేయటంతో నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రూప్-1 పరీక్షల్లోనూ అక్రమాలు జరిగాయి. ఉద్యోగ, ఉపాధి కల్పనలో రాష్ట్ర పరిస్థితి దయనీయం. ఏటా రూ.లక్షలు ఖర్చు పెట్టి వివిధ రకాల శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు ఉపాధి కల్పించే సమర్థత ఈ ప్రభుత్వానికి లేకపోవటంతో యువజన, విద్యార్థి సంఘాలు జగన్ వైఫల్యాలను నిలదీస్తున్నాయి. పది, ఇంటర్ పరీక్షలను (inter exams) అన్ని రాష్ట్రాలు రద్దు చేస్తే.., జగన్ మాత్రం ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారు. నిత్యం అబద్ధాలతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు. రాష్ట్ర ఆదాయం పడిపోవటంతో ప్రజలను మభ్యపెట్టేందుకే రోజుకో ప్రకటన చేస్తున్నారు." -చంద్రబాబు
సంక్షేమం మాటున అనేక అక్రమాలు
సంక్షేమం మాటున అనేక అక్రమాలు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ బోగస్ అన్నారు. లబ్ధిదారుల ఎంపికలో కోత విధించి చేయూత పేరుతో మోసగించారని ఆరోపించారు. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నెలకు రూ.3 వేలు పింఛన్ (pension) ఇస్తానని ఎన్నికల ముందు మాటిచ్చిన జగన్..అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పారని ధ్వజమెత్తారు. ఏటా రూ.36 వేలు చొప్పున 5 ఏళ్లలో ప్రతి మహిళకు రూ.1.80 లక్షలు చెల్లించాల్సి ఉండగా..రూ.1.05 లక్షలు ఎగ్గొట్టారని ఆక్షేపించారు. ఏటా రూ.18 వేలు మాత్రమే ఇస్తూ.. 4 ఏళ్లకే పథకాన్ని పరిమితం చేశారని మండిపడ్డారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తాననే హామీని విస్మరించటంతో పాటు ఫించను రూ.3 వేలు చేస్తానని రూ.250 మాత్రమే పెంచి వితంతువులు, వృద్ధులను మోసగించారని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ఉప ప్రణాళికలో రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించటంతో అత్యాచారాలు, సెటిల్మెంట్లు, ఫ్యాక్షన్ హత్యలు, గంజాయి స్మగ్లింగ్ నిత్యకృత్యమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.