చెత్త పన్నుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ సర్పంచులున్న ప్రతిచోట తీర్మానాలు చేస్తే.. వైకాపా సర్పంచులపై ఒత్తిడి పెరిగి వారి మద్దతు కూడా లభిస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ప్రకాశం, నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాల నుంచి తెదేపా తరపున గెలుపొందిన సర్పంచ్‌లతో పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఆయన సమావేశం నిర్వహించారు. పంచాయతీ నుంచి పంచాయతీకి రోడ్లు వేయలేని జగన్ రెడ్డి.. పల్లెవెలుగు విమానాలు నడుపుతానంటున్నాడని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
వాలంటీర్ల కోసం ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని మండిపడ్డారు. రూ.26 వేల కోట్ల నరేగా నిధులు వచ్చినా.. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమన్నారు. పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం కాకుండా కాపాడాల్సిన బాధ్యత సర్పంచ్‌లదేనని అన్నారు. భారతీ సిమెంట్ లాభాల కోసం సిమెంట్ ధరలు పెంచి నిర్మాణ వ్యయం పెంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులను వెంటనే విడుదల చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని స్థానిక ప్రజాప్రతినిధులకు చంద్రబాబు సూచించారు. ఫైనాన్స్ కమిషన్ నిధులు పంచాయతీలకు ఇవ్వకుంటే దిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేయాలని.., ఆ దిశగా పార్టీ తరఫున కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. గ్రామాల్లో సర్పంచులదే కీలక పాత్ర అని..,అలాంటిది వారికి నిధులు ఇవ్వకుండా తెదేపా హయాంలో కట్టించిన భవనాలకు రంగులేసుకోవడంతోనే వైకాపా పాలన సరిపోతోందని ధ్వజమెత్తారు. "ఎన్నికల ముందు జగన్ ముద్దులు పెట్టారు. ఇప్పుడు గుద్దులు గుద్దుతున్నారు" అని ఎద్దేవా చేశారు. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచిన ప్రభుత్వం.. జెన్కో ఉద్యోగులకు జీతాలివ్వలేకపోతుందని విమర్శించారు. సీఎం జగన్ హోల్‌సేల్‌గా రాష్ట్రాన్ని దోచుకుంటే..మిగిలిన అధికార పార్టీ నేతలు చిల్లర దోపిడీలు చేస్తున్నారని దుయ్యబట్టారు.