ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CBN : 'ధైర్యముంటే అసెంబ్లీని రద్దు చేయండి'

CBN ON PARISHAD RESULTS
CBN ON PARISHAD RESULTS

By

Published : Sep 20, 2021, 6:35 PM IST

Updated : Sep 21, 2021, 5:03 AM IST

17:58 September 20

CBN ON PARISHAD RESULTS

మందకృష్ణకు చంద్రబాబు పరామర్శ

 

  ‘ప్రతిపక్షం వదిలేసిన ఎన్నికల్లో గెలిచామని భుజాలు చరుచుకోవడం ముఖ్యమంత్రి జగన్‌ అవగాహన లోపానికి నిదర్శనం. ఆయనకు నిజంగా ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనే ఆలోచన, ధైర్యముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాల’ని తెదేపా సవాలు విసిరింది. ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని వైకాపా ఎలా అపహాస్యం చేసిందో దేశమంతా చూసిందని ధ్వజమెత్తింది. తెదేపా వ్యూహ కమిటీ సమావేశం సోమవారం పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఆన్‌లైన్‌లో జరిగింది. గుజరాత్‌లో పట్టుబడ్డ రూ.72వేల కోట్ల హెరాయిన్‌ అక్రమ రవాణాకు, విజయవాడకు సంబంధమున్నట్టు వస్తున్న వార్తలను బట్టి చూస్తే భవిష్యత్తులో మాదకద్రవ్యాల రవాణాకు ఏపీ కేంద్రంగా మారనుందన్న ఆందోళన కలుగుతోందని సమావేశం పేర్కొంది.

     ‘దేశంలో ఈ స్థాయిలో మాదకద్రవ్యాలు పట్టుబడటం ఇదే మొదటిసారి. అఫ్గానిస్థాన్‌ స్మగ్లర్లకు తాడేపల్లితో లింకు లేకపోతే అంత భారీస్థాయిలో మాదకద్రవ్యాలను ఏపీకి తరలించే ప్రయత్నం ఎలా జరుగుతుంది? ఆ డ్రగ్స్‌తో సంబంధమున్న కంపెనీ రిజిస్ట్రేషన్‌.. జగన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాకే విజయవాడలో జరిగింది. రాష్ట్రంలో మరోపక్క గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్‌ పెరిగింది. నాసిరకం మద్యం అమ్ముతున్నారు. అసోంలో తిరుమల శ్రీవారికి చెందిన తలనీలాలు పట్టుబడ్డాయి. జగన్‌రెడ్డి అవినీతి... వైన్‌, మైన్‌, ల్యాండ్‌, శాండ్‌మాఫియాను దాటి అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది. తాలిబన్లు, ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకునే వరకు తీసుకెళ్లారు. దీనిపై దర్యాప్తు చేసి దోషులెవరో తేల్చి రాష్ట్రాన్ని ప్రమాదంనుంచి కాపాడాలి’ అని నేతలు డిమాండ్‌ చేసినట్టు తెదేపా కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. అన్నదాతలకు అండగా సంయుక్త కిసాన్‌మోర్చా ఈనెల 27న నిర్వహించనున్న భారత్‌ బంద్‌కు తెదేపా సంఘీభావం ప్రకటించింది. పేదలనుంచి డబ్బులు గుంజేందుకు వన్‌టైం సెటిల్మెంట్‌ పేరుతో జగన్‌రెడ్డి గృహనిర్మాణ పథకాల లబ్ధిదారులను మోసం చేస్తున్నారని, తెదేపా అధికారంలోకి వచ్చాక గృహరుణాలను రద్దు చేస్తుంది కాబట్టి.. ఎవరూ రుణాలు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది.

డీజీపీ రీకాల్‌ కోసం కేంద్రానికి ఫిర్యాదు

చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనపై చర్యలు తీసుకోవాలని డీజీపీ కార్యాలయానికి వెళ్లిన తెదేపా నేతలను ఎస్పీ అమ్మిరెడ్డి బెదిరించి నెట్టివేశారని, దీనిపై సభాహక్కుల సంఘానికి ఫిర్యాదు చేయాలని.. న్యాయం జరగనట్లయితే ప్రైవేటు కేసు వేయాలని సమావేశం నిర్ణయించింది. డీజీపీ సవాంగ్‌ను రీకాల్‌ కోసం కేంద్రానికి, డీవోపీటీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. జోగి రమేష్‌ కాన్వాయ్‌ని 25వాహనాలు, రౌడీలతో చంద్రబాబు నివాసం వరకు అనుమతించడం వారితో డీజీపీ కుమ్మక్కుకు నిదర్శనమని మండిపడింది. ఎలాంటి అర్హతలు లేని గౌరీశంకర్‌ను ఫైబర్‌నెట్‌ ఈడీగా ముఖ్యమంత్రే స్వయంగా సంతకం పెట్టి నియమించడం దేనికి సంకేతమని నేతలు మండిపడ్డారు. ‘రూ.4,700 కోట్లు ఖర్చయ్యే ఫైబర్‌గ్రిడ్‌ ప్రాజెక్టును తెదేపా ప్రభుత్వం వినూత్న ఆలోచనలతో రూ.330 కోట్లతోనే పూర్తి చేసింది. ప్రభుత్వానికి డబ్బు ఆదా చేసిన అధికారిపై జగన్‌రెడ్డి కుట్ర పన్ని అక్రమ కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

నైతికత లేని ఎన్నికలపై మాట్లాడను: చంద్రబాబు
మంద కృష్ణమాదిగను పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి

     వైకాపా వైఖరికి నిరసనగా ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను తొలుతే తాము బహిష్కరించామని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తాము బహిష్కరించిన, నైతికత లేని ఎన్నికల ప్రక్రియ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని అన్నారు. దిల్లీలో శస్త్రచికిత్స అనంతరం హైదరాబాద్‌ అంబర్‌పేటలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను సోమవారం ఆయన పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ నేరాలకు పాల్పడలేదని వివరించారు. తాము రౌడీయిజం చేయాలనుకుంటే వారు బయటకు వచ్చేవారు కాదన్నారు. ఏపీలో తెదేపాను ఎవరూ ఏం చేయలేరని, వారు పెట్టేవన్నీ తాత్కాలిక ఇబ్బందులేనని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని, తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయని వివరించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న తనపైనే తప్పుడు కేసులు బనాయించారన్నారు. మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ త్వరగా జరిగేలా సహకరించాలని కోరారు. తెదేపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు, నేతలు టీడీ జనార్దన్‌, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కంభంపాటి రామ్మోహన్‌రావు తదితరులు చంద్రబాబు వెంట ఉన్నారు.

సమావేశం నిర్ణయాలివి
* 81మందితో తితిదే జంబో బోర్డు ఏర్పాటుచేసి దానిలో నేరాలు, ఘోరాలు చేసినవారికి చోటు కల్పించి తిరుమల పవిత్రతను మంటగలిపారు. దీనిపై పోరాడతాం.
*  కార్మికుల బీమా సొమ్ము రూ.వేయి కోట్లను కూడా జగన్‌రెడ్డి సొంత అవసరాలకు వాడేశారు. ఈఏపీ ప్రాజెక్టులకు విదేశీ సంస్థలిచ్చిన నిధులనూ దారి మళ్లించి విదేశాల్లో రాష్ట్ర పరువు మంటగలిపారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర వాటా నిధులు విడుదల చేయడం లేదు.
*  విద్యుత్‌ ఛార్జీల భారం తగ్గించకపోతే ప్రజల తరఫున పోరాడతాం. అర్హులైన వృద్ధులు, దివ్యాంగుల పెన్షన్లు, రేషన్‌కార్డులను తొలగించడాన్ని ఖండిస్తున్నాం. సమావేశంలో పార్టీ నాయకులు అచ్చెన్నాయుడు, రామకృష్ణుడు, నిమ్మల రామానాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎన్‌.చినరాజప్ప, వర్ల రామయ్య, ధూళిపాళ్ల నరేంద్ర, బండారు సత్యనారాయణమూర్తి, దేవినేని ఉమా, పయ్యావుల కేశవ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 

DIG: చంద్రబాబు ఇంటికి జోగు రమేశ్ అందుకే వెళ్లారు: డీఐజీ

Last Updated : Sep 21, 2021, 5:03 AM IST

ABOUT THE AUTHOR

...view details