Chandababu on Godavari floods : వరద కష్టాల్లో ఉన్న ప్రజలకు ప్రభుత్వం ఉందనే నమ్మకాన్ని కల్పించాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. భారీ వర్షాల కారణంగా గోదావరికి వరదలొచ్చి 6 జిల్లాల్లోని 42 మండలాల పరిధిలో 525 పైగా గ్రామాల ప్రజల జీవనం అస్తవ్యస్తమయిందని పేర్కొన్నారు. పోలవరం ముంపు గ్రామాలతో పాటు.. లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని.. ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆదమరచి నిద్రపోతోందని ధ్వజమెత్తారు. ఇటువంటి విపత్తుల సమయంలో ప్రభుత్వం నుంచి ప్రజలకు అందే చిన్న సూచన కూడా వారికి ధైర్యాన్ని ఇస్తుందని తెలిపారు. తగిన సమయంలో అప్రమత్తం చేయడం వల్ల ప్రజల ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించగలమన్నారు.
రాష్ట్రంలో పిడుగులు ఎప్పుడు, ఎక్కడ పడతాయో ముందుగా తెలియజేసే సాంకేతిక వ్యవస్థను గతంలో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకువచ్చిందని చంద్రబాబు గుర్తు చేశారు. వరదలపై ఆయా గ్రామాల ప్రజల మొబైల్ ఫోన్లకు రియల్ టైంలో వరద సమాచారం పంపి.. వారిని అప్రమత్తం చేసేలా టెక్నాలజీని పాలనతో మిళితం చేసిందన్నారు. ప్రకృతి విపత్తులలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని మోహరింపజేసి ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు తక్షణ సాయం అందించేవాళ్లమని చంద్రబాబు వివరించారు. అయితే నేడు రాష్ట్రంలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని.. ఆనాటి వ్యవస్థలను పూర్తిగా నాశనం చేశారని మండిపడ్డారు. యంత్రాంగాన్ని నడిపించాల్సిన పాలకుల అలసత్వంతో ప్రజలు అల్లాడుతున్నారని ఆక్షేపించారు.