మిగులు విద్యుత్ రాష్ట్రంలో కరెంట్ కష్టాలకు జగన్ విధానాలే కారణమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. 'బాదుడే బాదుడు' కార్యక్రమంపై పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్
నిర్వహించిన ఆయన.. మూడేళ్లలో ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజలపై 16 వేల కోట్ల రూపాయల భారం వేశారని విమర్శించారు. లక్షల మంది ఉపాధి కోల్పోయేలా ప్రభుత్వ చర్యలున్నాయని మండిపడ్డారు. చెత్త, ఆస్తి పన్నులు పెంచి ప్రజలపై తీవ్ర భారం మోపుతున్నారని ఆక్షేపించారు. రిజిస్ట్రేషన్ వాల్యూలో 15 శాతం ఆస్తిపన్ను రూపంలో వసూలు చేస్తూ.. ప్రజల జేబులు గుల్ల చేస్తున్నారన్నారు. శ్రీలంకలా ఏపీ కూడా దివాలా తీసినట్లు జగన్ ప్రకటిస్తారేమోనని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
రూపాయి ఖర్చు పెట్టకుండా రెండు పదవులివ్వడం సామాజిక న్యాయం ఎలా అవుతుందని ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. అన్ని వర్గాల ప్రజలను తీవ్రంగా నష్టపరిచిన వైకాపా పాలన అంతానికి తెలుగుదేశం శ్రేణులు నడుంబిగించాలని సూచించారు. తెదేపాకు అధికారం.. ఇప్పుడు చారిత్రక అవసరమని రాష్ట్రం మిగిలి ఉండాలంటే తెలుగుదేశం అధికారంలోకి రావాలని చంద్రబాబు అన్నారు. 'బాదుడే బాదుడు' కార్యక్రమం ద్వారా సీఎం జగన్ నిర్ణయాలతో జరుగుతున్న నష్టం, భారంపై విస్తృతంగా ప్రచారం చేయ్యాలని చంద్రబాబు సూచించారు. తాను కూడా ఈ కార్యక్రమంలో పలు చోట్ల స్వయంగా పాల్గొననున్నట్లు వెల్లడించారు.