కొవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్న ప్రభుత్వాస్పత్రులకు వెంటనే ఆక్సిజన్ సరఫరా చేయాలని ముఖ్యమంత్రి జగన్కు భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు లేఖ రాశారు. ఆక్సిజన్ కొరత కారణంగా వందలాది మంది మరణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నేడు అనంతపురం జిల్లా కదిరిలోని కొవిడ్ ఆస్పత్రిలో ప్రాణవాయువు అందక రోగులు మరణించడం బాధాకరమని అన్నారు. బెడ్స్ కొరత వల్ల ఒకే పడకపై ఇద్దరు రోగులకు చికిత్స అందిస్తున్నారని చెప్పారు.
నేలమీద రోగులను పడుకోబెడుతున్నారని తెలిపారు. ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను పెంచడంతో పాటు అవసరమైన మందులు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలన్నారు. కరోనా వ్యాప్తిని ముందస్తు అంచనా వేయకపోవటం వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి.. యుద్ధ ప్రాతిపదికన ఆక్సిజన్ సరఫరా పెంచాలని కోరారు. తాత్కాలిక ఆక్సిజన్ స్టోరేజ్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సూచించారు.