ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

APUTF: యూటీఎఫ్​ 'చలో సీఎంవో'.. అడుగడుగునా కట్టడి! - aputf chalo cmo

APUTF Demand to Cancel CPS: సీపీఎస్​ రద్దు చేయాలన్న డిమాండ్‌తో యూటీఎఫ్​ తలపెట్టిన సీఎంవో ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఎక్కడికక్కడ అడ్డగింతలు, అరెస్టులు, నిర్బంధాలతో అణగదొక్కారు. రెండు రోజుల ముందు నుంచే నిర్బంధకాండ ప్రారంభించిన పోలీసులు.. సీఎంవో ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. అన్ని నిర్బంధాలనూ చేధించుకుని విజయవాడ చేరుకున్న కొందరిని అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్లకు తరలించారు.

aputf chalo cmo
యూటీఎఫ్​ 'చలో సీఎంవో

By

Published : Apr 25, 2022, 8:31 PM IST


APUTF News:సీపీఎస్​ రద్దు హామీని అమలు చేయాల్సిందేనంటూ యూటీఎఫ్​ నిర్వహించిన సీఎంవో కార్యాలయ ముట్టడి స్వల్ప ఉద్రిక్తతలకు దారితీసింది. ఉద్యోగుల సమ్మె సమయంలో చలో విజయవాడ విజయవంతమైన నేపథ్యంలో పోలీసులు ఈసారి మాత్రం పకడ్బందీ ప్రణాళికతో టీచర్లను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించి ఎవరూ రాకుండా అడ్డుకున్నారు. సీసీ కెమెరాలు సహా డ్రోన్ కెమెరాల ద్వారా పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. సీఎం క్యాంపు కార్యాలయం ముందు నుంచి వెళ్లాల్సిన అమరావతి, సచివాలయం సహా పలు గ్రామాలకు వెళ్లే బస్సులను దారిమళ్లించారు. ఆర్టీసీ బస్సులు, ఆటోలు,ఇతర ప్రయాణికుల వాహనాలను తాడేపల్లిలో ఎక్కడా ఆపకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. హైవే నుంచి సర్వీసు రోడ్ల వైపు ఎవరూ వెళ్లకుండా రెండు కిలోమీటర్ల మేర ఇనుప కంచెలు వేశారు.

శనివారం రాత్రి నుంచే పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా ముందస్తు చర్యలు చేపట్టారు. సీఎంవో ముట్టడికి వెళ్లొద్దంటూ ఉపాధ్యాయ నేతలకు నోటీసులు జారీ చేశారు. ఎక్కడికక్కడ యూటీఎఫ్ నేతలు, ఉపాధ్యాయులను గృహ నిర్బంధం చేశారు. రైళ్లు, బస్సులు, ప్రైవేటు వాహనాలను తనిఖీ చేసి ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలో హోటళ్లు, లాడ్జీలు, రైల్వేస్టేషన్, బస్టాండ్లలో తనిఖీలు నిర్వహించారు. విజయవాడ చుట్టూ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినా.. ఆ నిర్భందాలను దాటుకొని వచ్చిన కొందరిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. తాము కొత్తగా ఏమీ అడగడం లేదని.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సీఎంను కోరుతున్నామని యూటీఎఫ్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లాల నుంచి ముందురోజే విజయవాడకు చేరిన కొందరు యూటీఎఫ్‌ నేతలను పోలీసులు అరెస్టు చేసి వారి సొంత జిల్లాలకు పంపారు. ఉపాధ్యాయులు విజయవాడకు వస్తారన్న ఆలోచనతో చాలా ప్రాంతాల నుంచి విజయవాడ సర్వీసులను నిలిపేశారు. దీంతో సామాన్యులు కూడా ఇబ్బందిపడ్డారు. మొత్తంమీద తనిఖీలు, అరెస్టుల నిర్బంధకాండతో ప్రభుత్వం సీఎంవో ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకుంది.


ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details