వైకాపా ప్రభుత్వానికి మాట తప్పడం, మడమ తిప్పడం దినచర్యగా మారిందని ఏపీసీసీ ఉపాధ్యక్షులు తులసి రెడ్డి అన్నారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో తులసిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతులకు రూ.12,500 పెట్టుబడి సాయం ఇస్తామని జగన్ మేనిఫెస్టోలో పెట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు రూ.6,500 మాత్రమే ఇస్తామని, మిగతా రూ.6 వేలు కేంద్రం ఇస్తుందని అంటున్నారన్నారు. వ్యవసాయ రుణాలపై సున్నా వడ్డీ అని జగన్ హామీ ఇచ్చి సీఎం అయ్యాక... రూ3,500 కోట్లు ఇస్తామని, బడ్జెట్లో కేవలం వంద కోట్లు కేటాయించారని విమర్శించారు.
వైకాపా మాట తప్పే మడమ తిప్పే పార్టీ: తులసి రెడ్డి - tulasi reddy
వైకాపా నేతలు.. ప్రభుత్వం ఏర్పడక ముందు ఓ మాట, తర్వాత మరో మాట మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఆరోపించారు. రైతులకు పెట్టుబడి సాయం, రుణాలపై వైకాపా మాట తప్పిందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విమర్శించిన జగన్... ప్రాజెక్టులను ఆపేయాలని డిమాండ్ చేశారని గుర్తుచేశారు. సీఎం అయ్యాక మాటమార్చి కేసీఆర్పై పొగడ్తలు కురిపిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇరవై మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రంపై పోరాడి హక్కులను సాధిస్తామన్న వైకాపా... ఇప్పుడు వేచి చూడక తప్పదంటూ నిట్టూర్పులు వదులుతున్నారన్నారు. మద్యపాన నిషేధం మూడు దశల్లో అన్న జగన్ ఇప్పుడు ప్రభుత్వమే నిర్వహిస్తుందని చట్టాలు చేస్తున్నారని తులసి రెడ్డి ఆరోపించారు. 55 రోజుల జగన్ పాలనలో ప్రజలకు ఒరింగిందేమీ లేదన్నారు.
ఇదీ చదవండి :2024 ఎన్నికలే లక్ష్యంగా.. జనంలోకి జనసేన