విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌తో... ఏపీ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా కళాశాలల యాజమాన్యాలు తమ ఇబ్బందులను ప్రభుత్వానికి వివరించాయి. సీఎం జగన్ పాదయాత్రలో 70వేల రూపాయల ఫీజు లేనిదే.. కళాశాలలు ఎలా నిర్వహిస్తారని చెప్పారని యాజమాన్యాలు గుర్తుచేశాయి.
కానీ ఇప్పుడు ఫీజుల నిర్ణయం సరిగా ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశాయి. ఫీజులను ప్రతి మూడేళ్లకు ఒక సారి 25శాతం పెంచాల్సి ఉండగా.. 35శాతం తగ్గించటాన్ని వారు తప్పుబట్టారు. మంచి ఫీజులు ఇస్తే నాణ్యమైన విద్య అందించడానికి వీలుంటుందన్నారు. 2019-20లో కళాశాలల ఫీజులు 35వేల రూపాయల నుంచి 1.08లక్షల రూపాయలుంటే... ఇప్పుడు గరిష్ఠంగా 70వేల రూపాయలు ఉండటం సరికాదన్నారు. అతితక్కువ ఫీజులతో నడిచే కళాశాలలు ఏపీలోనే ఉన్నాయనీ...రుసుములు పెంచకపోతే జీతాలు ఇవ్వలేమని ఆవేదన వ్యక్తం చేశాయి.