ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి పోలీసులు నిరాకరిస్తే నేర విచారణ ప్రక్రియ స్మృతి సెక్షన్ 2000 ద్వారా ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేసుకోవాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అధికరణ 226 కింద హైకోర్టులో రిట్ దాఖలు చేయడానికి వీల్లేదని పేర్కొంది. ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే రిట్ దాఖలు చేయడానికి వీల్లేదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర , జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తితో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యనించింది.
తమ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని ఇటీవల పలువురు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఎస్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు. వాటిపై విచారణ జరిపిన ఏకసభ్య ధర్మాసనం.. కాగ్నిజబుల్ నేరాల విషయంలో ఫిర్యాదు అందితే ఎఫ్ఐఆర్ నమోదు తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఒకవేళ ఎస్ఐఆర్ నమోదు చేయకపోతే మెజిస్ట్రేట్ వద్ద ఫిర్యాదుకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయన్నారు. హైకోర్టు కంటే మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించటం మరింత ప్రయోజనకరమైన ప్రత్యామ్నాయమార్గమని స్పష్టం చేస్తూ.. వ్యాజ్యాలను కొట్టేవేసింది.