103 జీవోపై ఎన్జీఓ సంఘం అనవసర రాద్ధాంతం చేస్తోంది: ఏపీజీఈఏ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలను గుర్తిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబరు 103 రద్దు చేయాలని ఏపీ ఎన్జీఓ సంఘం ఆందోళనలు చేయడం హాస్యాస్పదం, అర్థరహితమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(ఏపీజీఈఏ) అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు. తమ సంఘం ప్రభుత్వ గుర్తింపు పొందిన సందర్భంగా విజయవాడలో ఏర్పాటుచేసిన రాష్ట్రస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వానికి అనుబంధంగా వ్యవహరించిన ఏపీ ఎన్జీఓల సంఘం... ఉద్యోగులకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏ ఒక్కటీ చేపట్టలేదని ఆరోపించారు. ఇప్పుడు ఏ సంఘానికి గుర్తింపు ఇవ్వకూడదని ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసేవిధంగా ఎన్జీఓ సంఘం నిరసనలు చేస్తోందని ఆరోపించారు. సీఎం విదేశీ పర్యటనలో ఉండగా కొందరు ఐఏఎస్ అధికారులు 103 జీవో విడుదల చేశారని ఎన్జీఓ సంఘం అవాస్తవాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు. అన్ని నిబంధనలు కలిగిన డాక్యుమెంట్లు ప్రభుత్వానికి సమర్పించిన తరువాతే జీవో జారీ చేశారన్నారు. ఇటువంటి చౌకబారు రాజకీయాలు వీడి.. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కలిసి పనిచేయాలని కోరారు.
ఇదీ చదవండి :