ప్రభుత్వం పేదలకు పంచాలని నిర్ణయించుకున్న భూమిలో వివిధ పనుల కోసమని ప్రభుత్వం దాదాపు 10 వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిందని.. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మించిన 6 లక్షల ఇళ్లను పేదలకు ఇవ్వడానికి, నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తిచేయడానికి ప్రభుత్వానికి ఉన్న సమస్య ఏంటని నిలదీశారు. ప్రతిపక్షానికి పేరు వస్తుందన్న దురాలోచనతో పేదలను ఇబ్బందులకు గురిచేస్తారని ఆలపాటి పేర్కొన్నారు.
వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆవ భూముల్లో జరిగిన అవినీతిని బహిరంగంగానే ప్రశ్నించారని గుర్తు చేశారు. తెనాలి నియోజకవర్గంలో ఇళ్లపట్టాల భూసేకరణ ప్రక్రియ ప్రారంభమవ్వడానికి నెలముందు భూములుకొని, తరువాత అధిక ధరలకు ప్రభుత్వానికి అమ్మారని ఆరోపించారు. భూమి కొనుగోలు నుంచి అన్నింటిలో అడుగడుగునా అవినీతి జరిగిందని ఆలపాటి విమర్శించారు.