అన్నం పెట్టే అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడడం బాధాకరమైన విషయమని ఏఐసీసీ సభ్యుడు నరహరశెట్టి నరసింహారావు అన్నారు. రైతుల ఆత్మహత్యలపై రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేయాలని కోరారు. ఆత్మహత్యలను నివారించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు సంఘీభావంగా విజయవాడలో నరసింహారావు నిరసనకు దిగారు. తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకొంటున్న వైకాపా నాయకులు.. రైతుల సమస్యలను పట్టించుకోవటంలేదని ఆరోపించారు.
రాజధాని అమరావతికి భూములు త్యాగం చేసిన రైతులను వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. 180 రోజులుగా నిరసన చేస్తున్న రాజధాని ప్రాంత రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతులను రుణ విముక్తులను చేసే చర్యలు చేపట్టి, పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలన్న నరసింహారావు.. రైతు సమస్యలపై ముఖ్యమంత్రి స్పందించాలని కోరారు.