నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకమే తప్పయినప్పుడు, ఆయనను మళ్లీ అదే పోస్టులో నియమించడం ద్వారా ప్రభుత్వం మరో తప్పు చేయాలా..? అని అడ్వకేట్ జనరల్ శ్రీరాం వ్యాఖ్యానించారు. ఈ అంశంపై స్పష్టత కోసమే సుప్రీంకోర్టుని ఆశ్రయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు. ఎస్‌ఈసీ పోస్టులో తనను తాను నియమించుకుంటూ, ప్రభుత్వ అధికారులకు రమేష్ కుమార్ జారీ చేసిన ఆదేశాలు చెల్లుబాటవ్వవని, వాటిని పాటించాల్సిన అవసరం వారికి లేదని ఆయన స్పష్టం చేశారు.
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‌తో కలసి రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్య శ్రీరాం మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాల్ని అమలు చేసేందుకు ప్రభుత్వానికి రెండు నెలల సమయం ఉంటుందన్నారు.
ఆ తీర్పుపై స్టే ఇవ్వాల్సిందిగా మళ్లీ హైకోర్టులోనే ప్రభుత్వం తరఫున పిటిషన్ వేశామని, సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటామని ఆయన వెల్లడించారు. హైకోర్టు తీర్పుపై చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారని, తాము కోర్టుల్ని పరిపాలన వ్యవస్థలో భాగంగానే చూస్తామని వారి అభిప్రాయాల్ని, తీర్పుల్ని అనుసరిస్తామని చెప్పారు.
హైకోర్టు కోర్టు తీర్పు శుక్రవారం ఉదయం 11.30 గంటల సమయంలో వస్తే... తాను ఎస్‌ఈసీగా పునర్నియామకమైనట్లు అదే రోజు మధ్యాహ్నం 3.30కి జిల్లా కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలు, జిల్లా పంచాయతీ అధికారులు, మున్సిపల్ కమిషర్లు, పంచాయతీరాజ్, పురపాలక శాఖల ముఖ్యకార్యదర్శులు తదితరులకు నిమ్మగడ్డ రమేష్ సర్క్యులర్ పంపించారని, ఎస్‌ఈసీ పోస్టులో పునర్నియామకమైనట్లు ఆయనంతట ఆయనే ప్రకటించుకున్నారని ఏజీ శ్రీరాం వివరించారు.
తాను పత్రికా ప్రకటన విడుదల చేశానని, అదే విషయాన్ని అందరికీ తెలియజేస్తూ సర్క్యులర్ ఇవ్వాల్సిందిగా ఎస్‌ఈసీ సెక్రటరీని రమేష్‌కుమార్ ఆదేశించారని చెప్పారు. అయితే హైకోర్టు తీర్పును పరిశీలిస్తే ఎస్ఈసీగా రమేష్ కుమార్ మళ్లీ నియమించాల్సిదిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పిందన్నారు.