ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈ-కేవైసీ తంటాలు...ఆధార్ కేంద్రాల వద్ద భారీ క్యూలు - Adhaar centre

విజయవాడ నగరంలోని అన్ని ఆధార్‌ కేంద్రాలు జనసందోహంగా మారాయి. తెల్లవారుజామున నుంచే ఆధార్ కేంద్రం వద్ద  బారులు తీరుతున్నారు. చంటిపిల్లలతో తెల్లవారుజామునే వచ్చి ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన చెందుతున్నారు. ఆధార్‌లో సవరణలు, పేర్ల నమోదు కోసం వస్తున్న వారితో ఆధార్ కేంద్రాల వద్ద తొక్కిసలాట పరిస్థితులు నెలకొంటున్నాయి. మహిళలు, విద్యార్థులు గంటల తరబడి రహదారులపై నిరీక్షిస్తున్నారు. రేషన్‌ కార్డులకు ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలనే నిబంధన ఈ పరిస్థితులకు దారి తీసింది.

ఈ-కేవైసీ తంటాలు...ఆధార్ కేంద్రాల వద్ద భారీ క్యూలు

By

Published : Aug 23, 2019, 4:48 PM IST

ఈ-కేవైసీ తంటాలు...ఆధార్ కేంద్రాల వద్ద భారీ క్యూలు
పిల్లల తల్లులు, వృద్ధులు, మహిళలు, విద్యార్ధులు, ఉద్యోగులు ఇలా.. ఒక్కరేమిటి రేషన్‌ కార్డులో పేరున్న వారందరూ ఒకటే హైరానా పడుతున్నారు. కార్డులో పేరున్నవారంతా ఈ-కేవైసీ చేయించుకోవాలన్న పౌరసరఫరాల శాఖ ఆదేశాలతో లబ్ధిదారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఈ-కేవైసీ నమోదు పూర్తి కాకుంటే రేషన్‌ నిలిపేస్తారేమోనన్న భయం వారిని నిలవనీయడం లేదు. రేషన్‌ దుకాణాలు, మీ-సేవ కేంద్రాలు, తపాలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

లబ్ధిదారులలో ఆందోళన
విజయవాడ నగరంలోని ఆధార్‌ కేంద్రాల వద్ద తెల్లారకముందే చేరుకుని ఎప్పుడు తెరుస్తారా అని ఎదురుచూస్తున్నారు. పల్లె, పట్నం తేడా లేకుండా ప్రతిచోటా ఇలాంటి సందడే కనిపిస్తోంది. ఆధార్ సవరణల్లో ఆలస్యమైతే రేషన్‌ కార్డులతో పాటు అమ్మఒడి, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అనర్హులమవుతామోనన్న భయంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణాష్టమి సందర్భంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించటంతో పిల్లలను తీసుకొని తల్లిదండ్రులు ఈ కేంద్రాల వద్దకు వెళ్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యం
ప్రజల అవసరాలకు అనుగుణంగా కేంద్రాలను పెంచడంలో ఆధార్‌ ప్రాధికార సంస్థ ప్రాంతీయ అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం వయసు, అర్హత పత్రాలు తప్పుగా చూపిస్తున్నట్లు ఆధార్‌ ప్రాధికార సంస్థ గుర్తించింది. ఈ క్రమంలో భద్రతా కారణాల దృష్ట్యా నమోదు కేంద్రాలను ప్రభుత్వ కార్యాలయాల పరిధిలోనే ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. మీ-సేవలో ఒక ఆపరేటర్‌, తహసీల్దారు కార్యాలయంలో మరో ఆపరేటర్‌ను నియమించుకోవాల్సి వస్తోందని నిర్వాహకులు పేర్కొంటున్నారు.

పని చేయని 300 మీ-సేవ కేంద్రాలు
ఫలితంగా రాష్ట్రంలో సుమారు 300 మీ-సేవా కేంద్రాల్లో పని నిలిచిపోయింది. 750 కేంద్రాలే సేవలందిస్తున్నాయి. లోగడ ఆధార్‌ నమోదు సమయంలో ప్రైవేటు ఆపరేటర్లకు బాధ్యతలు అప్పగించడం వలన ఈ పొరపాట్లు దొర్లాయి. ఇప్పుడు వాటిని సరిదిద్దుకోవాల్సి వస్తోంది. 5ఏళ్లలోపు పిల్లలకు గతంలో వేలిముద్రలు అవసరం లేకుండానే ఆధార్‌ ఇచ్చారు. వయసు పెరిగిన నేపథ్యం, 15 ఏళ్లకు వేలిముద్రలు పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. ఈ కారణాలతో ప్రజలందరూ ఒక్కసారిగా ఆధార్ కేంద్రాల వద్దకు బారులు తీరుతున్నారు. సర్వర్లు సరిగా పని చేయకపోవడం వలన రోజుకు 10 నుంచి 15 మందికి మాత్రమే ఆధార్‌ నమోదు, సవరణలు చేస్తున్నారు. ఈ కారణంగా రోజుల తరబడి తిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

గడువు పెంపు
విద్య, మహిళా శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో 15ఏళ్ల లోపు పిల్లలకు ఈ-కేవైసీ నమోదు చేపడుతున్నట్లు పౌర సరఫరాలశాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ తెలిపారు. ఈ ప్రక్రియ మూడు నెలల్లో పూర్తవుతుందన్నారు. 15 ఏళ్లు పైబడిన వారు ఈ-కేవైసీ చేయించుకునేందుకు సెప్టెంబరు 5 వరకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. రద్దీ నివారించేందుకు గడువు పెంచామని వివరించారు. ఇప్పటికే ఉన్న కార్డులను తొలగించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ప్రజలకు అవగాహన కల్పించాలని ఉన్నతాధికారులు జిల్లాల సంయుక్త కలెక్టర్లకు కమిషనర్ సూచించారు.

అడ్డంకులివే..!
నమోదు, మార్పుచేర్పులు సక్రమంగా కొనసాగడానికి ఆపరేటర్‌ క్రియాశీలతతోపాటు కంప్యూటర్‌, విద్యుత్‌, సర్వర్‌ అనుకూలించాలి. వీటిలో ఒకటి తేడా వచ్చినా నమోదు నిలిచిపోతుంది. పలుచోట్ల ఇవే సమస్యలు తలెత్తుతున్నాయి. పేరు, పుట్టిన తేదీ, ఇతర మార్పులకు పత్రాలు వెదుక్కోవాల్సి వస్తోంది. పేరు మార్చాలంటే పదో తరగతి మార్కుల పత్రం తీసుకెళ్లాల్సి ఉంటుంది. వీటిపై గెజిటెడ్‌ అధికారి లెటర్‌హెడ్‌పై మాత్రమే ధ్రువీకరించాలి.

హైదరాబాద్ వెళ్లాల్సిందే
పుట్టిన తేదీ మార్పిడి రెండేళ్లకు మించి చేయాలంటే హైదరాబాద్‌లోని ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లాల్సిందే. తొలుత ఇక్కడ నమోదు చేయించుకుని తిరస్కరణకు గురయ్యాక ఆ పత్రాలతో హైదరాబాద్‌కు వెళ్లాలి. ఆన్‌లైన్‌లో ఆధార్‌ సవరణకు సంబంధించి చిరునామా మార్పునకే పరిమితం చేశారు. వీటన్నింటికీ మొబైల్ నంబరు అవసరం, అందుకుగాను మొబైల్‌ నంబర్‌ నమోదు చేయించుకునేందుకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. తపాలా కార్యాలయాలు, బ్యాంకుల్లో ఆధార్‌ నమోదు కేంద్రాలున్నా సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడింది.

ఇదీ చదవండి :

భార్యాభర్తల మధ్య మనస్పర్థలు.. ఆత్మహత్యకు యత్నించిన భార్య

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details