గతేడాది రబీకి సంబంధించిన ధాన్యం బకాయిల చెల్లింపుల్లో రైతులకు జరిగిన వడ్డీ నష్టాన్ని ప్రభుత్వమే భరించాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ఖరీఫ్ పెట్టుబడుల కోసం అన్నదాతలు అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా పిలుపుతో రోడెక్కిన రైతులు...ముఖ్యమంత్రి జగన్ దిగొచ్చేలా ధాన్యం బకాయిలు రాబట్టి విజయం సాధించారన్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో 48 గంటల్లో చెల్లించే ధాన్యం బకాయిల గడువును జగన్ 21 రోజులకు పెంచారని ఆక్షేపించారు. అది కూడా గడువులోపు చెల్లించకుండా నెలలు తరబడి జాప్యం చేశారని మండిపడ్డారు.
వ్యవసాయం, రైతు సంక్షేమం గురించి జగన్ చెప్పే మాటలకు ,అమలయ్యే పనులకు పొంతన లేక రైతులు తీవ్రంగా నష్టపోతూ అప్పులపాలవుతున్నారు. వైకాపా నేతల అడ్డాగా రైతు భరోసా కేంద్రాలను మార్చేశారని దుయ్యబట్టారు. ఈ-క్రాప్ నమోదు నిర్లక్ష్యం కారణంగా ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్న ధాన్యం రైతులు క్వింటాకు రూ.800 వరకూ నష్టపోతున్నారన్నారు. మిల్లర్లు, వైకాపా నేతలు కుమ్మకై..రైతుల్ని దోచుకుంటుంన్నారని ఆరోపించారు. ఇకనైనా అవినీతి, దుబారా ఖర్చును అరికట్టి రైతులకు తెదేపా ప్రభుత్వం చేసినట్లుగా రుణమాఫీ చేయాలిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.