పెగాసస్ వ్యవహారంలో వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తన మీద చేసిన ఆరోపణలపై.. ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్పందించారు. అమర్నాథ్ వ్యాఖ్యలకు ఆధారాలు ఉంటే.. ప్రభుత్వానికి ఇవ్వొచ్చని సూచించారు. అమర్నాథ్ వ్యాఖ్యలపై పరువునష్టం దావా వేస్తానని ఆయన ప్రకటించారు. ఆయనవి ఆధారాల్లేని ఆరోపణలని అందరికీ తెలుస్తోందని వ్యాఖ్యానించారు. పలువురిపై పరువునష్టం దావా వేస్తున్నట్లు.. ఇప్పటికే ప్రకటించిన ఏబీ వెంకటేశ్వరరావు తాజాగా తనపై ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌పైనా దావా వేస్తున్నట్లు పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
అమర్నాథ్ ఏమన్నారంటే :పెగాసెస్ స్పైవేర్ వ్యవహారంలో.. ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయని వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఏబీ వెంకటేశ్వరరావుది ఇండియన్ పోలీసు సర్వీసు కాదని.. ఇజ్రాయెలీ పెగాసెస్ సర్వీసు అని ఎద్దేవా చేశారు. మమతా బెనర్జీ ఎలాంటి వ్యాఖ్యలూ చేయకపోతే.. నారా లోకేష్ ఎందుకు తడబడుతున్నారని ప్రశ్నించారు.