ఇంట్లోకి చొరబడి మరీ కత్తితో పొడిచి హతమార్చడం, సజీవ దహనాలకు పాల్పడటం లాంటి ఘోరాలు గత వారం రోజుల్లోపే విజయవాడ నడిబొడ్డున జరగడం ఒక్కసారిగా అందరినీ కలకలానికి గురిచేసింది. ఈ రెండు ఘటనల్లోనూ బంగారు భవిష్యత్తు ఉన్న యువతులు ఇద్దరు యువకుల ప్రేమోన్మాదానికి బలైపోయినవారే కావడం బాధాకరం. చిన్నారి, దివ్యతేజస్వినిల ఘటనలు ప్రతి ఒక్కరి హృదయాలను కలచివేశాయి. 2014లో ఇతర కారణాల వల్ల 1,175 హత్యలు, ప్రేమ వ్యవహారాలతో 8 హత్యలు జరిగాయి.
* 2014-19 మధ్య రాష్ట్రంలో ఏటా హత్యల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. 2014తో పోలిస్తే 2019 నాటికి 25.95% మేర హత్యల సంఖ్య తగ్గింది. కానీ ప్రేమహత్యలు దాదాపు 3 రెట్లు పెరిగాయి.
* 2014 నుంచి 2019 మధ్య 2016లో మినహా మిగతా సంవత్సరాల్లో ప్రేమహత్యల్లో పెరుగుదలే నమోదైంది.
అదే 2019లో చూసుకుంటే ఇతర కారణాల వల్ల 873.. ప్రేమ వ్యవహారాల వల్ల 23 జరిగాయి. దీన్ని బట్టి చూస్తే.. సాధారణ హత్యల సంఖ్య తగ్గుతుండగా ప్రేమహత్యల సంఖ్య పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.
కారణాలు ఎన్నెన్నో..
ప్రేమపేరుతో జరిగే హత్యలకు రకరకాల కారణాలుంటున్నాయి. కొన్నిసార్లు ప్రేమించాలని అమ్మాయిల వెంటపడి వేధిస్తున్నారు. వారు కాదంటే కక్ష పెంచుకుని హతమారుస్తున్నారు. ఎక్కువ హత్యలకు ఇదే కారణం అవుతోంది.