ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నాలుగో రోజైన ఆశ్వయుజ శుద్ధ చవితి మంగళవారంనాడు అన్నపూర్ణాదేవిగా అమ్మవారు భక్తులకు సాక్షాత్కరిస్తున్నారు. ఎడమ చేతిలో బంగారు పాత్రను ధరించి, మరో చేత్తో వజ్రాలు పొదిగిన గరిటెను పట్టుకుని... రూపంలో ఎరుపు, పసుపు, నీలం రంగు దుస్తుల్లో చవితి నాడు అన్నపూర్ణాదేవిగా అమ్మ కొలువుదీరుతుంది. ఆదిభిక్షువైన ఈశ్వరుడికి బిక్షపెట్టిన దేవతగా అన్నపూర్ణాదేవిగా కనిపిస్తోంది. అక్షయ శుభాలను అందించే ఈ తల్లి.. తనను కొలిచేవారికి ఆకలి బాధను తెలియనివ్వదని ప్రతీతి.
అన్నపూర్ణగా దర్శనమిచ్చే కనకదుర్గ అమ్మవారిని ఈ రోజున తెల్లని పుష్పాలతో పూజించి అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలి వస్తున్నారు. కొవిడ్ నిబంధనల దృష్ట్యా రోజుకు కేవలం పది వేల మందికి మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు. నవరాత్రుల్లో సేవా కార్యక్రమాలైన లక్ష కుంకుమార్చన, చండీహోమం, శ్రీ చక్ర వాహర్ణార్చన, వేద పారాయణంను పరోక్ష విధానంలో నిర్వహిస్తున్నారు. ఆన్లైన్లో టికెట్ కొనుగోలు చేసిన వారి గోత్ర నామాల పేరిట అర్చక స్వాములే ఆర్జిత సేవలు పూజలు నిర్వహిస్తున్నారు. కొవిడ్ దృష్ట్యా పదేళ్ల లోపు చిన్న పిల్లలను, 65ఏళ్లు దాటిన వృద్దులు, వికలాంగులను ఆలయంలోకి అనుమతించడం లేదు. నవరాత్రుల్లో భాగంగా ఇవాళ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తే సకల శుభాలు జరుగుతాయని అర్చకులు తెలిపారు.