ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

2018 గ్రూప్-1 ఫలితాలు విడుదల.. టాప్-1గా పిఠాపురం వాసి - APPSC Chairman Gowtham Sawang release group 1 results

2018 Group 1 Results Out
2018 Group 1 Results Out

By

Published : Jul 5, 2022, 6:08 PM IST

Updated : Jul 6, 2022, 5:39 AM IST

18:05 July 05

గ్రూప్​ 1 ఫలితాలు విడుదల చేసిన ఎపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్

2018 Group-1 Results Out: రాష్ట్రంలో 2018 గ్రూప్‌-1 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. ఇంటర్వ్యూల్లో ఎంపికైన అభ్యర్థుల వివరాలను విజయవాడలో ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు. 2018లో 167 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నియమాక ప్రక్రియ చేపట్టింది. గ్రూప్‌-1 ఉద్యోగాలకు ఎంపికైన వారిలో 67 మంది మహిళలు, 96 మంది పురుషులు ఉన్నారని గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. వివిధ కారణాలతో నాలుగు పోస్టులు భర్తీ చేయలేదని చెప్పారు.

పారదర్శకంగా మౌఖిక పరీక్షలు
2018 డిసెంబరులో 167 గ్రూపు-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆ నోటిఫికేషన్‌కు సంబంధించిన అభ్యర్థుల జాబితా వెల్లడిని పురస్కరించుకొని కార్యదర్శి హెచ్‌.అరుణ్‌కుమార్‌, సభ్యులతో కలిసి కమిషన్‌ ఛైర్మన్‌ గౌతం సవాంగ్‌... మంగళవారం సాయంత్రం ఏపీపీఎస్సీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘అభ్యర్థులకు మౌఖిక పరీక్షలు మూడు బోర్డుల ద్వారా పారదర్శకంగా జరిగాయి. ఈసారి అదనంగా మరో అఖిల భారత స్థాయి అధికారిని బోర్డులోకి తీసుకున్నాం. సబ్జెక్టు నిపుణుల కింద విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, సీనియర్‌ ప్రొఫెసర్లు, విశ్రాంత ఉప కులపతులకు అవకాశాన్ని కల్పించాం. ప్రతి బోర్డులో ఐదుగురు ఉంటే ముగ్గురు బయట నుంచి వచ్చిన వారే’ అని గౌతంసవాంగ్‌ తెలిపారు.

జవాబుపత్రాన్ని మళ్లీ దిద్దితే మార్కుల్లో తేడాలొస్తాయి
‘హైకోర్టు ఆదేశాలను అనుసరించి సంప్రదాయ పద్ధతి(కన్వెన్షన్‌)లోనే జవాబుపత్రాల మూల్యాంకనం జరిగింది. సీసీ కెమెరాల నిఘాలో రెండు, మూడుసార్లు జవాబుపత్రాలను నిపుణులు మూల్యాంకనం చేశారు. డిజిటల్‌, సంప్రదాయ మూల్యాంకనాల ద్వారా మౌఖిక పరీక్షలకు ఎంపికైన వారి జాబితాల్లో వచ్చిన వ్యత్యాసాల గురించి హైకోర్టులో విచారణ సాగుతోన్నందున వివరాలు చెప్పలేం. దీనిపై గవర్నర్‌కు నివేదించాం. ప్రతి పేపరులో ఉన్న 15 ప్రశ్నలకు పది మార్కుల చొప్పున కేటాయించాం. ఒక పేపరును దిద్దిన ప్రొఫెసర్‌ అదే పేపరును మరోసారి దిద్దితే మార్కుల కేటాయింపులో తప్పకుండా తేడాలు వస్తాయి. దీని ప్రకారం ఐదు పేపర్లలో వచ్చిన మార్కుల్లో తప్పకుండా హెచ్చుతగ్గులు ఉంటాయి. గతంలో ఎన్నడూ ఇలా రీ-వాల్యూయేషన్‌ జరగలేదు’ అని గౌతంసవాంగ్‌ వివరించారు. ‘ఎంపికచేసిన వారి జాబితాను శాఖల వారీగా హెచ్‌వోడీలకు పంపుతాం. వారు నియామక పత్రాలు జారీ చేస్తారు’ అని కార్యదర్శి అరుణ్‌కుమార్‌ తెలిపారు.

వచ్చే నెలలో గ్రూపు-1, గ్రూపు-2 నోటిఫికేషన్లు
‘వచ్చే నెలలో గ్రూపు-1, గ్రూపు-2 నోటిఫికేషన్లను ఇస్తాం. ఇప్పటికే జారీచేసిన వాటిల్లోని 13 నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తాం. రెవెన్యూ శాఖకు చెందిన జూనియర్‌ అసిస్టెంట్స్‌, దేవాదాయ శాఖకు చెందిన ఇంజినీరింగ్‌ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలను ఇప్పటికే ప్రకటించిన తేదీల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. గ్రూపు-1 ఉద్యోగాలకు మౌఖిక పరీక్షలు నిర్వహించాలా? వద్దా? అన్న దానిపై ఇంకా చర్చలు సాగుతున్నాయి. నోటిఫికేషన్‌ జారీ నాటికి నిర్ణయం తీసుకుంటాం’ అని గౌతం సవాంగ్‌ వెల్లడించారు.

తొలి పది మంది వీరే...
నోటిఫికేషన్‌లో పేర్కొన్న 167 పోస్టుల్లో 30 డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు ఉన్నాయి. డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులకు ఎంపికైన తొలిపది మంది వివరాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. వీరిలో రాణి సుస్మిత(కాకినాడ జిల్లా) కె.శ్రీనివాసులురాజు(అన్నమయ్య జిల్లా), వి.సంజనాసింహా(హైదరాబాద్‌), ఎన్‌.రామలక్ష్మి(విజయవాడ), పి.శ్రీలేఖ(అనంతపురం జిల్లా), ఎన్‌.మనోజ్‌రెడ్డి(అన్నమయ్య జిల్లా), కె.మధులత(అనంతపురం), డి.కీర్తి(విశాఖపట్నం), ఎస్‌.భరత్‌నాయక్‌(అనంతపురం), ఎ.సాయిశ్రీ(బళ్లారి) ఉన్నారు.

మార్కులనూ బహిర్గతం చేయాలి
ఎంపిక జాబితా ప్రకటించినప్పుడు వచ్చిన మార్కులనూ వెల్లడిస్తే అభ్యర్థులకు ఉపయుక్తంగా ఉంటుంది. గతంలో ఈ విధానం అమల్లో ఉంది. ఎంపికైన వారిలో తెలుగు మాధ్యమంలో చదివిన వారెంత మంది ఉన్నారో ప్రకటించాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ వివరాలనూ ప్రకటిస్తామని కమిషన్‌ కార్యదర్శి అరుణ్‌కుమార్‌ చెప్పారు.

టాప్-1గా పిఠాపురానికి చెందిన రాణి సుస్మిత:డిప్యూటీ కలెక్టర్ల పోస్టులకు ఎంపికైన వారిలో టాప్​లో నిలిచిన అభ్యర్థుల వివరాలను గౌతమ్‌ సవాంగ్‌ ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన రాణి సుస్మిత టాప్‌-1లో నిలిచారని వెల్లడించారు. టాప్‌- 2లో వైఎస్సార్‌ జిల్లా కోతులగుట్టపల్లికి చెందిన కె.శ్రీనివాసరాజు, టాప్‌- 3లో హైదరాబాద్‌కు చెందిన సంజన సింహ ఉన్నారు.

హైకోర్టు ఆదేశాల మేరకు 165 గ్రూప్‌-1 పోస్టుల ఖాళీల భర్తీ కోసం ఇంటర్వ్యూలు పారదర్శకంగా పూర్తి చేశాం. 3 బోర్డులు నియమించి పారదర్శకంగా గ్రూప్‌-1 ఇంటర్వ్యూలు నిర్వహించాం. నాలుగేళ్లపాటు జరిగిన నియమాక ప్రకియను విజయవంతంగా పూర్తి చేశాం. హైకోర్టు ఇచ్చిన అన్ని ఆదేశాలను ఏపీపీఎస్సీ కచ్చితంగా అమలు చేసింది. వచ్చే నెలలో 110 పోస్టులతో గ్రూప్‌-1, 182 పోస్టులతో గ్రూప్‌-2 నోటిఫికేషన్లు విడుదల చేస్తాం. ఈనెల 24న దేవాదాయశాఖలో ఈవో పోస్టులకు, 31, రెవెన్యూ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్ పోస్టులకు రాత పరీక్ష ఉంటుంది. డిజిటల్‌ వ్యాల్యూయేషన్‌పై న్యాయస్థానంలోనూ విచారణ జరిగింది. టెక్నాలజీ వినియోగంతో రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయి'' అని వెల్లడించారు.

ఇదీ చదవండి:

Last Updated : Jul 6, 2022, 5:39 AM IST

ABOUT THE AUTHOR

...view details