Police imposed restrictions in old city: ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యల నేపధ్యంలో పాత బస్తీలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజాసింగ్‌ను అరెస్ట్ చేయాలంటూ ఓ వర్గం పలు ప్రాంతాల్లో గత రాత్రి నుంచి ఆందోళనకు దిగింది. చార్మినార్, మదీన, చాంద్రయాణగుట్ట, బార్కాస్, సిటీ కాలేజ్ తదితర ప్రాంతాల్లో వందల సంఖ్యలో రోడ్లపై చేరి రాజాసింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉదయం కొంతమంది ఆందోళనకారులను అరెస్టు చేసిన పోలీసులు తాజాగా మరో 20 మందిని షాలిబండ వద్ద అరెస్టు చేశారు.
భారీగా మోహరించిన పోలీసులు.. ఈ నేపథ్యంలో పాతబస్తీలోని పలుప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీసులను మోహరించారు. నేర విభాగ అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ రోజు ఉదయం పత్తర్ ఘట్టి కార్పొరేటర్ సోహెల్ ఖాద్రి ఆధ్వర్యంలో షాలిబండలో ర్యాలీకి బయల్దేరగా పోలీసులు అడ్డకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళన చేస్తున్న 31మందిని ఆరెస్ట్ చేసి కంచన్ భాగ్ పీఎస్‌కి తరలించారు. ఇదే సమయంలో మధ్యాహ్నం మొఘల్ పురాతో పాటు మీర్ చౌక్ ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు రావడంతో వాటిని నమ్మొద్దని పోలీసులు తెలిపారు. ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో సాయంత్రం ర్యాలీగా వచ్చిన 20 మంది ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.