రాష్ట్రంలో కొత్తగా 1,935 కరోనా కేసులు, 37 మంది మృతి - corona virus cases in ap news
16:52 July 13
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. 24 గంటల వ్యవధిలో కరోనా కారణంగా 37 మంది మృతి చెందారు. మరో 1,935 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇప్పటి వరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 31, 103కు పెరిగింది.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రస్థాయికి చేరింది. 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 37 మంది కరోనా కారణంగా మృతి చెందినట్టు వైద్యారోగ్యశాఖ తెలియజేసింది. కరోనా ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ రికార్డు స్థాయిలో మరణాలు నమోదు కావటం ఇదే తొలిసారి. కొవిడ్ కారణంగా అనంతపురం జిల్లాలో 6, కర్నూలులో 4, తూర్పుగోదావరిలో 4, పశ్చిమగోదావరిలో 4, చిత్తూరు-3, గుంటూరులో 3, కృష్ణ-3, ప్రకాశం జిల్లాలో 3, కడపలో 2, నెల్లూరులో 2, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఒక్కోక్కరు చొప్పున మృతి చెందినట్టు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకూ వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 365కు చేరింది.
గడిచిన 24 గంటల వ్యవధిలో 19 వేల 247 నిర్ధరణ పరీక్షలు చేస్తే అందులో 1,935 మందికి వైరస్ సోకినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొంది. అత్యధికంగా తూర్పుగోదావరిలో 313 మందికి, కర్నూలులో 249, శ్రీకాకుళంలో 204, గుంటూరులో 191, అనంతపురం 176, చిత్తూరులో 168, కృష్ణా జిల్లాలో 111, నెల్లూరులో 99, ప్రకాశం జిల్లాలో 34, విశాఖలో 84, విజయనగరంలో 69, పశ్చిమగోదావరిలో 137 మంది కరోనా పాజిటివ్ గా నిర్ధరణ అయినట్టు తెలియచేసింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 31,103 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అవ్వగా.. 14274 మంది చికిత్స పొందుతున్నారు. 16 వేల 464 మంది డిశ్ఛార్జి అయ్యారు.
ఇప్పటి వరకూ రాష్ట్రంలో 11 లక్షల 73,096 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేసినట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ప్రతీ పది లక్షల జనాభాలో 21 వేల 968 మందికి కరోనా టెస్టులు చేస్తున్నట్లు వెల్లడించింది.