చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన కుమార్ చిన్నతనం నుంచే వెయిట్ లిఫ్టింగ్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనేది అతని కోరిక. లక్ష్యమైతే నిర్దేశించుకున్నాడు కానీ తన ఆర్థిక స్థోమత అంతంతమాత్రమే. ఆటో డ్రైవర్ అయిన తన తండ్రి సుబ్రహ్మణ్యానికి వచ్చే ఆదాయంతోనే ఇల్లు గడవాల్సిన పరిస్థితి. కష్టాలు వెంటాడుతున్నప్పటికీ అతను తన ప్రయత్నాన్ని ఆపలేదు. పాతికేళ్ల వయస్సు వచ్చేప్పటికి 110 కిలోల బరువు ఎత్తేలా రాటు దేలాడు. కుమారుడిని ప్రోత్సహించేందుకు అతని తల్లి బంగారు గొలుసును అమ్మి జిమ్ పరికరాలను సమకూర్చింది. వాటితోనే ప్రాక్టీస్ చేసిన కుమార్.. 180 కేజీల బరువు ఎత్తే స్థాయికి చేరుకున్నాడు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో పలు పోటీల్లో పాల్గొని ఇప్పటి వరకూ 44 పతకాలు గెల్చుకున్నాడు.
వెయిట్ లిఫ్టర్ కావాలనుకున్నాడు... కూలీగా మారాడు - financial problems
వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో రాణిస్తున్నాడు ఆ యువకుడు. 180 కేజీల బరువును అలవోకగా ఎత్తేయగలడు. ఇప్పటికే జిల్లా,రాష్ట్ర స్థాయి పోటీల్లో 44 పతకాలు కూడా సాధించాడు. జాతీయ స్థాయిలో రాణించాలన్న లక్ష్యం ఉన్నప్పటికీ ఆర్థిక స్థోమత లేక మట్టిలో మాణిక్యంలా మిగిలిపోయాడు. కూలి పనులు చేస్తూ తనలాంటి మరికొందరికి శిక్షణ ఇస్తున్నాడు.
కూలీగా విధులు
అయితే చిత్తూరు జిల్లాలో పవర్ లిఫ్టింగ్ కంటూ ప్రత్యేకంగా వసతులు లేకపోవటం... గుంటూరు, విజయవాడ వంటి ప్రదేశాలకు వెళ్లి శిక్షణ తీసుకునే ఆర్థిక స్థోమత లేకపోవటంతో కుమార్ కేవలం రాష్ట్రానికి పరిమితమైపోయాడు. బాడీ బిల్డింగ్ పైనా దృష్టి సారించిన కుమార్... రాష్ట్రస్థాయి వేదికల్లో బహుమతులు సాధించాడు. ఎన్ని చేసిన తనలోని వెయిట్ లిఫ్టర్కి ఇవి సాయం చేయలేకపోయాయి. చివరికి తండ్రి కష్టంపైన ఆధారపడకూడదని తితిదేలో యాత్రికుల బ్యాగులను వాహనాల్లోకి చేరవేసే కూలీగా ఉద్యోగంలోకి చేరాడు. తనకి వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే మరో 14 మంది కుర్రాళ్లకు వెయిట్ లిఫ్టింగ్‌లో శిక్షణ ఇస్తున్నాడు.
సాయం కోసం ఎదురుచూపులు
ప్రస్తుతం కుమార్ వయస్సు దాదాపు 35 సంవత్సరాలు.. అయినా అతనికి జాతీయ స్థాయికి ప్రాతినిధ్యం వహించాలన్న కోరిక పోలేదు. ఇప్పటికీ 180కేజీలు ఎత్తుతున్న కుమార్... 200కిలోల పైన ఎత్తగలిగితే జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలకు వెళ్లవచ్చని చెబుతున్నాడు. సరైన డైట్, ప్రొటీన్లతో కూడిన ఆహారం, వెయిట్ లిఫ్టింగ్ కోసం సామాగ్రి వంటి వాటి విషయంలో ప్రభుత్వం సాయం కోరుతున్నాడు.