వైద్యో నారాయణో హరి...ప్రాణాలను నిలబెట్టే వైద్యులను భగవంతునితో పోల్చే సంస్కృతి మనది. మన మనుగడకు కారణమవుతున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సింది ఎవరని ప్రశ్న వేసుకున్నారా? కచ్చితంగా ఓటరే. బాధ్యతాయుతమైన ఓటు హక్కును వినియోగించుకుని సరైన నాయకుడిని ఎన్నుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన కర్తవ్యం ప్రతి ఓటరుది. ఇదే స్పృహను ప్రజల్లో రగిలించేలా వినూత్నప్రచారం చేపట్టింది తిరుపతిలోని నారాయణాద్రి ఆసుపత్రి యాజమాన్యం. ఏప్రిల్ 11న బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకుని వచ్చే ప్రతి ఓటరుకు ఉచితంగా వైద్య చికిత్సలు అందించాలనే నిర్ణయం తీసుకుంది. వాటినిఏ సాధారణ వైద్య చికిత్సలకో పరిమితం చేయలేదు.ఖరీదైన హృదయ, కిడ్నీ, గైనకాలజీ సంబంధిత సమస్యలకు సైతం ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటిచింది నారాయణాద్రి ఆసుపత్రి యాజమాన్యం. ఇలా ఏప్రిల్ 11నుంచి 22 వరకు ఈ వైద్యసేవలను అందించనున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి గోడ పత్రికలను సైతం విడుదల చేశారు. ఓటరు చైత్యనం కోసం భారత ఎన్నికల సంఘం వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు మద్దతుగా నారాయణాద్రి ఆసుపత్రి యాజమాన్యం సైతం ముందుకు వచ్చి ఓటర్లలో అవగాహన పెంచే కార్యక్రమం చేపట్టింది. తిరుపతి శివార్లలో బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేయటం ద్వారా ఓటు విలువ తెలిసేలా చేస్తోంది. ఓటురును చైతన్య పరిచేందుకు ఏం చేయాలనే ఆలోచన నుంచి...ఓటుకు ఉచిత వైద్యమనే ఆలోచన పుట్టిందని ఆసుపత్రి ప్రతినిధులు వెల్లడించారు.