తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు కన్నుల పండువగా సాగుతున్నాయి. అర్ధరాత్రి తర్వాత అర్చకులు శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వారం తెరిచారు. అభిషేకం, అర్చన, అలంకరణ అనంతరం ఉత్తర ద్వారం ద్వారా భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి శ్రీవారి దర్శనానికి భక్తులకు అనుమతించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే సహా పలువురు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు, తెలుగు రాష్ట్రాల మంత్రులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. సుమారు 3 వేలమంది ప్రముఖులు వైకుంఠ ద్వార దర్శనానికి హాజరయ్యారు. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులకు దర్శనం కల్పిస్తున్నామని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. జనవరి 3 వరకు ముక్కోటి ఏకాదశి వేడుకలు జరగనున్నాయి. పదిరోజుల పాటు టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు రద్దు చేశారు.
సాధారణ భక్తులకు గంటన్నర ముందే వైకుంఠద్వార దర్శనం ప్రారంభించిన్నట్లు అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటలకు అనుకున్నామని కానీ.. 7.30 గంటలకే ప్రారంభినట్లు తెలిపారు. పరిస్థితిని అంచనా వేసి ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం టిక్కెట్ల పెంచామన్నారు. సాధారణ భక్తులకు ఎక్కువ సమయం కేటాయించగలుగుతున్నామని వెల్లడించారు. ప్రముఖులు సహకరించడంతో సాధారణ భక్తులకు ఎక్కువ సమయం స్వామివారిని దర్శించుకుంటున్నట్లు వివరించారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో వెయ్యి చొప్పున టికెట్లు జారీ చేశామన్నారు. దాతలకు 2 వేల వైకుంఠ ద్వార దర్శన టికెట్లు కేటాయించామని తెలిపారు. ప్రముఖులు, అత్యంత ప్రముఖులు 3 వేలమంది స్వామివారిని దర్శించుకున్నారని అన్నారు. దాదాపు 7 వేలమందికి ఏకాదశి విరామ సమయ దర్శనం కల్పించామని అదనపు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.