తిరుమల తిరుపతి దేవస్థానానికి అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచంలో ఏ ఇతర ఆలయంలో లేని విధంగా భక్తులకు సేవలందిస్తున్నందుకు గాను తితిదేకు ఇంగ్లాండ్‌కి చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ సర్టిఫికెట్ అందజేసింది(Ttd Secures Place in World Book Of Records news). శనివారం తిరుమలలో తితిదే పాలకమండలి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి (ttd chairman yv subba reddy )కి ఆ సంస్థ ప్రతినిధులు ధ్రువీకరణ పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో ఎక్కడా లేనంతగా భక్తులకు సేవలు, సదుపాయాలు అందిస్తోందన్నారు. సాధారణ రోజుల్లో తిరుమలలో 60 నుంచి 70వేల మంది భక్తులకు చిన్నపాటి అసౌకర్యం కూడా లేకుండా సంతృప్తికరమైన దర్శనం చేయిస్తున్నామన్నారు. క్యూలైన్ల నిర్వహణ శాస్త్రీయ పద్ధతిలో జరుగుతోందని సుబ్బారెడ్డి చెప్పారు. రోజుకు 3.5లక్షల లడ్డూలు ఆరోగ్యకరమైన వాతావరణంలో తయారు చేస్తున్నట్టు వివరించారు.