శ్రీనివాసుడు కొలువైన తిరుమల క్షేత్రానికి... దేశ, విదేశాల నుంచి యాత్రికులు వస్తుంటారు. నిత్యం వేలాది మంది సందర్శించే ప్రాంతం కావడం వల్ల... నిరంతర నిఘా అత్యావశ్యకం. భద్రతకు పెద్దపీట వేస్తున్న తితిదే... ఆక్టోపస్ దళం, పోలీసుల సిబ్బందికి తోడు అధునాతన పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటోంది. తిరుమల కొండను మూడు బోన్లుగా విభజించి... అలయం, మాఢ వీధులు, తిరుమల రహదారులతో పాటు పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసింది. మొత్తం 17 వందల కెమెరాలు ఉన్న ఈ వ్యవస్థపై... కమాండ్ కట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుంది.
ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానం
కొండపైనున్న 20 కెమెరాలను ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానించారు. పాత నేరస్థులు, దళారులు, హైటెక్ యాచకులను... ఈ కెమెరాలు వెంటనే గుర్తుపట్టేసి సిబ్బందిని అప్రమత్తం చేస్తుంటాయి. దట్టమైన అటవీ ప్రాంతం కావడం వల్ల వన్యప్రాణులు, జంతువులు రోడ్లపైకి వచ్చినప్పుడు అప్రమత్తం చేసేలా... 'జోన్ ఇంట్రూషన్' సాఫ్ట్‌వేర్ కలిగిన 38 కెమెరాలు వినియోగిస్తున్నారు. అలాగే 'వెహికల్ కౌంట్ - నెంబర్ ప్లేట్ ఐడింటిఫికేషన్' సాయంతో... తిరుమలకు ఎన్ని వాహనాలు వస్తున్నాయి, వెళ్తున్నాయనే వివరాలు తెలుసుకుంటున్నారు. అగ్ని ప్రమాదాల సమాచారం చేరవేసేలా... ఆరు కెమెరాలకు 'ఫైర్ అండ్ స్మోక్ సాఫ్ట్‌వేర్' అనుసంధానించారు.