తలనీలాల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానంపై సామాజిక మాధ్యమాల్లో అనవసరంగా నిందిస్తున్నారని.. తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి అన్నారు. మిజోరంలో పోలీసులు నమోదు చేసిన కేసులో తితిదే పేరే లేదని స్పష్టం చేశారు. అత్యంత పారదర్శకంగా ఈ-వేలం ద్వారా తలనీలాలను విక్రయిస్తామని.. దీనిపై అసత్య ప్రచారం తగదని తెలిపారు.
కరోనాపై అధికారులతో సమావేశం..
తిరుమల అన్నమయ్య భవన్‌లో తితిదే ఉన్నతాధికారులతో అదనపు ఈవో ధర్మారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై చర్చించారు. భక్తులందరూ కొవిడ్ నిబంధనలు పాటించేందుకు చేపట్టవలసిన చర్యలపై సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టిక్కెట్ల సంఖ్యను తగ్గించామని.. భక్తులు సంచారం ఉన్న అన్ని ప్రాంతాల్లో నిరంతరం శానిటైజ్ చేయాలని ఆదేశించారు.
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నప్రసాదం, కల్యాణకట్ట ఇతర రద్దీ ప్రాంతాల్లో జాగ్రత్తలు పాటించాలన్నారు. కొవిడ్ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించేందుకు సూచి బోర్డులు పెట్టాలన్నారు. కరోనా కేసులు పెరుగుతున్నందున ఉగాది నుంచి ఆర్జిత సేవలకు భక్తలను అనుమంతించాలా లేదా అన్న విషయంపై మరో మారు చర్చిస్తామని తెలిపారు. తితిదే ఉద్యోగులందరూ కొవిడ్ వ్యాక్సిన్స్ వేసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి:మువ్వన్నెలు విరిసిన వేళ..శత వసంతాల హేల..!