ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 20, 2020, 6:06 PM IST

ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్: తిరుగిరులు నిశ్శబ్దం...దర్శనాలు నిలిపివేత

భక్తుల గోవింద నామస్మరణలతో మారుమోగే తిరు గిరులు నిశ్శబ్దాన్ని అలముకున్నాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి శ్రీనివాసుని దర్శనంపైనా ప్రభావం చూపింది. కరోనా వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతమవుతున్న కారణంగా అత్యంత రద్దీగా ఉండే తిరుమల పుణ్యక్షేత్రంలో ముందు జాగ్రత్తగా తితిదే కీలక నిర్ణయం తీసుకుంది. చరిత్రలో తొలిసారి వారం రోజులపాటు శ్రీవారి ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేసింది. శ్రీవారి దర్శనం కోసం గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్న భక్తులకు ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకు దర్శనం కల్పించిన తితిదే అనంతరం దర్శనాలను నిలిపివేసింది. తిరుమల చేరుకునే మార్గాలనూ మూసివేసింది.

Tirumla temple stops visiters darshan
తిరుమలలో భక్తుల దర్శనాలు నిలిపివేత

తిరుమలలో భక్తుల దర్శనాలు నిలిపివేత

కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా భక్తులకు తిరుమల ఆలయ ప్రవేశాన్ని నిలిపివేశారు. గురువారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి తిరుమలకు చేరుకునే మార్గాలైన శ్రీవారిమెట్టు, అలిపిరి కాలినడక మార్గాలతో పాటు కనుమ రహదారిని తితిదే మూసివేసింది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేసింది. శ్రీవారి దర్శనం కోసం తిరుమల చేరుకుని తితిదే వసతి గృహాలు, మఠాలలో ఉన్న భక్తులను తిరుమల వదిలి వెళ్లాలని అధికారులు సూచించారు. తిరుమలలో వివాహం చేసుకోవడానికి ముహూర్తం ఖరారు కుదుర్చుకున్న కుటుంబాల నుంచి వరుడు, వధువుతో పాటు ఆరుగురిని మాత్రమే తిరుమల వెళ్లడానికి అవకాశం కల్పించారు. తితిదేలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందిని అలిపిరి గరుడ కూడలి వద్ద గుర్తింపు కార్డులు పరిశీలించి తిరుమలకు అనుమతిస్తున్నారు.

తితిదే అనుబంధ ఆలయాల్లో దర్శనాలు బంద్
రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉంటున్న కారణంగా సగటున లక్షకు పైబడి భక్తులు వచ్చే తిరుమలలో వారం రోజుల పాటు శ్రీవారి దర్శనాలను నిలిపివేస్తూ తితిదే నిర్ణయం తీసుకుంది. ఇదే విధానాన్ని తితిదే అనుబంధ ఆలయాలకు వర్తింపజేసింది. తిరుపతిలోని కోదండరామస్వామి, గోవిందరాజస్వామి, శ్రీనివాస మంగాపురం కల్యాణ వెంకటేశ్వరస్వామి, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాల్లో దర్శనాలు నిలిపేశారు. తిరుమలలో అన్నదాన సత్రం, కల్యాణకట్టకు తాళాలు వేశారు. శ్రీవారి పుష్కరిణి మూసివేశారు. భక్తుల ఆలయ ప్రవేశం ఆగిపోవటంతో పోటులో లడ్డూ ప్రసాదాల ఉత్పత్తి నిలిపివేశారు. శ్రీవారికి వైదిక కార్యక్రమాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.

రైల్వేస్టేషన్, బస్టాండ్ వెలవెల
రద్దీగా ఉండే ప్రాంతాల్లో యాభై మందికి మించి ఉండకూడదన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో తిరుమలలో భక్తుల ప్రవేశాన్ని నిలిపివేయటంతో...భక్తులు లేక తిరుపతి రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌లు వెలవెలబోతున్నాయి.

ఇదీ చదవండి :నేటి నుంచి తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

ABOUT THE AUTHOR

...view details