సెప్టెంబరు 27వ తేదీ నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిచ్చి సంతృప్తికర దర్శనాన్ని అందించనున్నట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. కరోనా తరువాత శ్రీవారి వాహనసేవలను మాడవీధుల్లో నిర్వహిస్తున్న నేపథ్యంలో అన్నిరకాల ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేసి సర్వదర్శనానికి మాత్రమే భక్తులను అనుమతిస్తున్నామని చెప్పారు. గురువారం స్థానిక అన్నమయ్య భవనంలో డయల్ ఈవో కార్యక్రమం అనంతరం ఈవో మీడియాతో మాట్లాడారు. తిరుమలలో గదులు పొందిన భక్తులకు ఎదురయ్యే సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన కంప్లైంట్ ట్రాకింగ్ సిస్టమ్‌ను తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, గోవిందరాజస్వామి సత్రాల్లో అమలుచేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తితిదే కల్యాణమస్తు కార్యక్రమం వివిధ సాంకేతిక కారణాలతో ఆగింది.. త్వరలోనే పూర్తి ఏర్పాట్లను చేసుకుని నూతన మూహుర్తం తేదీని ప్రకటిస్తామన్నారు.అప్పటి వరకు కల్యాణమస్తు రిజిస్ట్రేషన్‌లను నిలుపుదల చేశామని చెప్పారు. శ్రీవారిని జులైలో 23.40 లక్షల మంది భక్తులు దర్శించుకోగా హుండీ కానుకలు అత్యధికంగా రూ.139.33 కోట్లు లభించాయని తెలిపారు.
తితిదే ఆధ్వర్యంలో ఆజాదీకా అమృత్ మహోత్సవాలు
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఆజాదీకా అమృతోత్సవాన్ని తితిదే ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నామని తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తితిదే అన్ని కార్యాలయాలు, ఉద్యోగుల ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని ఆదేశించామని చెప్పారు. దీంతోపాటుగా తిరుపతిలోని తితిదే పరిపాలన భవనం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వరకు తితిదే ఉద్యోగుల ఆధ్వర్యంలో అజాదీకా అమృతోత్సవ్ భారీ ర్యాలీని నిర్వహించనున్నట్లు చెప్పారు.