YCP Attack on TDP leader house: చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా నేత, గంగమ్మ ఆలయ పాలకవర్గం మాజీ ఛైర్మన్ రవి నివాసంపై అర్ధరాత్రి దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘాతుకానికి పాల్పడింది వైకాపా వర్గీయులేనని ఆరోపిస్తూ రవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయానికి సంబంధించి డిపాజిట్ పత్రాలను ఇవ్వాలంటూ... వైకాపా నేతలు ఫోన్లో బెదిరించారని మాజీ ఛైర్మన్ రవి వివరించారు. అలాంటివేమి పత్రాలేవీ తన దగ్గర లేవన్నందుకే..తన ఇంటిపై రాళ్లు, మద్యం సీసాలతో దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక తెదేపా నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు.
డీజీపీకి చంద్రబాబు లేఖ: వైకాపా గూండాల కారణంగా కుప్పంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గంగమ్మ గుడి మాజీ ఛైర్మన్ రవి ఇంటిపై మద్యం సీసాలు, రాళ్లతో అర్ధరాత్రి దాడి చేయడం వైకాపా అరాచకానికి నిదర్శనమని మండిపడ్డారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు డీజీపీ రాజేంద్రనాథరెడ్డికి ఆయన లేఖ రాశారు. వైకాపా నేతల దాడి ఫొటోలు, సీసీ టీవీ పుటేజీలను లేఖకు జత చేశారు. 'గతంలో ఎన్నడూ లేని విధంగా కుప్పంలో వైకాపా నేతలు శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తున్నారు. పోలీసుస్టేషన్‌కు 200 మీటర్ల దూరంలో ఉన్న రవి ఇంటిపై దాడి చేశారు. ఆయనకు ఫోన్ చేసి బెదిరించడమే కాకుండా.. ఇంటిపై దాడికి తెగబడటం దుర్మార్గం. కారణమైన వైకాపా నాయకులు సెంథిల్, శ్రీనివాసులు, కోదండంపై కేసు నమోదు చేయాలి. కుప్పంలో ప్రశాంతత దెబ్బతినకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలి' అని లేఖలో పేర్కొన్నారు.