ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీవారి సన్నిధిలో నిర్లక్ష్యం.... తీసింది నిండు ప్రాణం!

ఓ వ్యక్తి నిర్లక్ష్యం తిరుమలలో ఓ కుటుంబానికి తీరని విషాదం నింపింది. తమిళనాడు నుంచి స్వామివారి దర్శనానికి వచ్చిన ఆ కుటుంబం...వాహన రూపంలో దూసుకొచ్చిన మృత్యువుతో శోకసంద్రంలో మునిగిపోయింది. మూర్చ వ్యాధి ఉన్న వ్యక్తి..వాహనాన్ని నడుపుతూ భక్తులపైకి వెళ్లడంతో..యువకుడు మృతి చెందాడు.

By

Published : Jun 18, 2019, 8:02 AM IST

tamilanadu_boy_died_in_tirumala_temple

తమిళనాడులోని కోయంబేడుకు చెందిన బాబు... భార్య ఇందుమతి, ఇద్దరు కుమారులతో శ్రీవారి దర్శనానికి వచ్చారు. కాలినడకన కొండకు చేరుకున్న ఆ కుటుంబం... కొంతసేపు విశ్రాంతి తీసుకుని కల్యాణి సత్రానికి చేరుకున్నారు. తండ్రితోపాటు ఇద్దరు కుమారులూ తలనీలాలు సమర్పించారు. శ్రీవారిని దర్శించుకునేందుకు రహదారిపైకి వచ్చారు. ఇంతలోనే... అటునుంచి వచ్చిన సుమో..వారిలో ఒకరిమీదకు దూసుకొచ్చింది. అసలేమవుతుందో తెలుసుకునేలోపే...చిన్న కుమారుడు లోకప్రసాద్‌..సుమో చక్రాల కింద నలిగిపోయాడు.

శ్రీవారి సన్నిధిలో...నిర్లక్ష్యం తీసింది నిండు ప్రాణం!
తమ్ముడి కోసం అన్న తాపత్రయం

లోకప్రసాద్​పైకి సుమో ఎక్కడంతో రక్తపు మడుగులో ఉన్న కుమారుడిని చూసి తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు. తమ్ముడిని బతికించుకునేందుకు అన్న పడిన తాపత్రయం భక్తులను కలచివేసింది. కుమారుణ్ని భుజాలపై వేసుకుని ఆసుపత్రికి పరుగులు పెట్టినా ఫలితం లేకపోయింది. లోకప్రసాద్‌ మరణించాడని వైద్యులు ధ్రువీకరించడంతో గుండెలవిసేలా కుటుంబసభ్యులు రోదించారు. తితిదే వాహనంలో మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించారు.

డ్రైవర్​కు మూర్చ వ్యాధి

ఈ ప్రమాదానికి సుమో డ్రైవర్‌ ప్రత్యక్ష కారణమైతే.... పరోక్షంగా రవాణశాఖ, పోలీసు అధికారులు కారణమని తిరుమల వాసులు ఆరోపిస్తున్నారు. తిరుపతికి చెందిన సత్యనారాయణ...సుమోను అద్దెకు తిప్పుతున్నాడు. పదేళ్లుగా ఆయనకు మూర్చ వ్యాధి ఉందని, ఇప్పుడు ఫిట్స్‌ రావడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం అనంతరం డ్రైవర్‌నూ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. భక్తుల సంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో వాహనాలనూ అనుమతించకూడదనే నిబంధన ఉంది. పోలీసులు మామూళ్లకు అలవాటుపడి అద్దె వాహనాలను ఇష్టానుసారంగా అనుమతిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details