తితిదే ఆస్తుల విక్రయ తీర్మానం నిలుపుదల - తిరుమల ఆస్తుల అమ్మకం వార్తలు
21:11 May 25
తిరుమల తిరుపతి దేవస్థానం భూముల విక్రయాల ప్రతిపాదన తీర్మానాన్నీ నిలుపుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయంపై పునఃసమీక్ష చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
2016 జనవరి 30 తేదీన తితిదే బోర్డు 50 ఆస్తులను విక్రయానికి తీసుకున్న 253 తీర్మానాన్ని.. నిలుపుదల చేస్తున్నట్టు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మత పెద్దలు, ధార్మిక సంస్థలు, భక్తులు ఇతర భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ స్థలాల్లో దేవాలయాల నిర్మాణం, ధర్మ ప్రచార కార్యక్రమాలు లాంటివి చేపట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలన చేయాల్సిందిగా ప్రభుత్వం స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు 50 స్థలాల విక్రయ ప్రతిపాదన తీర్మానం నిలిపివేస్తున్నట్టు ఆదేశాల్లో తెలిపింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికను సమర్పించాల్సిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు ఇచ్చారు.
ఇదీ చదవండి: గోవిందుడి ఆస్తుల అమ్మకంపై గొడవ గొడవ