కరోనా పేరుతో అవసరం లేకున్నా కొన్ని ఆస్పత్రులు, ల్యాబొరేటరీలు సీటీ స్కాన్‌లు చేస్తున్నాయి. కొందరు వైద్యులు ల్యాబొరేటరీల నుంచి కమీషన్లకు కక్కుర్తి పడి ఈ తరహా అక్రమాలను ప్రోత్సహిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు తిరుపతిలో తనిఖీలు నిర్వహించగా తిరుపతి కేంద్రంగా ఉన్న పలు ల్యాబ్‌లు ప్రభుత్వ ధరల కంటే అధికంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు తేలింది. జిల్లాలో పలుచోట్ల కూడా ఇదే తరహాలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు విజిలెన్స్ దృష్టికి వచ్చింది.
- వెదురుకుప్పం మండలం పాతగుంటకు చెందిన వ్యక్తికి జ్వరం రాగా తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. కొవిడ్ లేదంటేనే వైద్యం చేస్తామని.. పక్కనున్న ల్యాబ్‌కు వెళ్లి సీటీ స్కాన్ చేయించుకుని రావాలని ఆస్పత్రి సిబ్బంది సూచించారు. రూ.5 వేలు చెల్లించి పరీక్ష చేయించుకున్నారు. ఆ తర్వాతే వైద్య సేవలు అందించారు.
- తిరుపతిలోని ఓ చిరుద్యోగికి వాంతులు, విరేచనాలు రావడంతో కరోనా అనుమానంతో మొదట రూ.6 వేలు చెల్లించి సీటీ స్కాన్ చేయించారు. ప్రామాణికం కోసం మళ్లీ ప్రైవేటులో ఆర్‌టీ- పీసీఆర్ పరీక్షకు రూ.3 వేలు చెల్లించి చేయించారు. ఓ సామాన్యుడు పరీక్ష కోసం రూ.9 వేలు చెల్లించుకున్నారు.
- వైద్యం కోసం ఆస్పత్రులకు వెళితే.. ప్రతిచోటా సీటీ స్కాన్ చేయించుకుని కరోనా రిపోర్టు తీసుకు రమ్మని చెబుతున్నారు. అది కూడా పలానా ల్యాబ్‌కే వెళ్లాలనే షరతులు పెడుతున్నారు. పీపీఈ కిట్ల ధర కూడా కలిపి కొన్నిచోట్ల రూ.7 వేల వరకు వసూలు చేస్తున్నారు.
ఆలస్యం ఆసరాగా..
కరోనా నిర్ధరణకు ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షతో పాటు ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పలు ప్రైవేటు ఆస్పత్రులు లాభాపేక్ష కోసం కొత్తగా సీటీ స్కాన్ల దిశగా బాధితులను ప్రోత్సహిస్తున్నారు. ల్యాబొరేటరీల్లో ఆర్‌టీ- పీసీఆర్ పరీక్ష ప్రైవేటుగా చేయించుకుంటే రూ.3 వేలు వసూలు చేస్తున్నారు. అదే సీటీ స్కాన్‌కు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు తీసుకుంటున్నారు. ఆర్‌టీ- పీసీఆర్ పరీక్ష ఫలితం కోసం కనీసం 24 గంటల సమయం తీసుకుంటుంది. సీటీ స్కాన్ ద్వారా గంటలో ఫలితం వస్తుందంటూ ఈ దిశగా ప్రోత్సహిస్తున్నారు. కరోనా అనుమానంతో అసలే ఆందోళన... ఆపై వైద్యుల సలహాతో బాధితులు మాయలో పడిపోతున్నారు. సీటీ స్కాన్‌తో రేడియేషన్‌తో దుష్ప్రభావం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా తిరుపతితో పాటు జిల్లాలోని పలు ల్యాబొరేటరీలు అవకాశాన్ని ఆసరా చేసుకుని దోపిడీకి పాల్పడుతున్నాయి.
చర్యలేవీ?
ఆస్పత్రులు, ల్యాబొరేటరీల్లో సేవలకు సంబంధించిన ధరలు బహిరంగంగా ప్రకటించాల్సి... ఉన్నా ఎక్కడా కనిపించడంలేదు. తిరుపతి నగరంతో పాటు చిత్తూరు, మదనపల్లె తదితర ప్రాంతాల్లో కరోనా పేరిట దందా సాగుతున్నా.. అధికారులు చర్యలు కూడా తీసుకున్న దాఖలాల్లేవు.