తిరుపతికి చెందిన రాజా అనిరుధ్ శ్రీరామ్ ఆరేళ్ల వయసులోనే రికార్డ్ సాధించాడు. ఈ బుడతడు ఇంజినీరింగ్ పట్టభద్రులు రాసే పరీక్ష రాసి సత్తా చాటాడు. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్పెషలిస్టు పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఔరా అనిపించాడు. సాకేత్ రామ్, అంజనా శ్రావణి దంపతుల కుమారుడైన అనిరుధ్ రెండో తరగతి చదువుతున్నాడు. కరోనా సమయంలో ఆన్‌లైన్ తరగతులకు హాజరవుతూనే..పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి కంప్యూటర్‌పై సాధన చేయడం మొదలుపెట్టాడు. మొదట్లో ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి అక్షరాలు టైపు చేయడం ప్రారంభించాడు. ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు..మెలకువలను నేర్పించి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్పెషలిస్టు పరీక్షకు సిద్ధం చేశారు.
మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్పెషలిస్టు పరీక్షలో తొలి దశలో వెయ్యికి 540 మార్కులు సాధించిన ఈ చిన్నారి..నిరంతర సాధన చేస్తూ 950 మార్కులు సాధించే స్థాయికి చేరాడు. మొదటి ప్రయత్నంగా ఆగస్టు 14న పరీక్షలో తప్పాడు. మరో వారం రోజులు సాధన చేసి రెండో ప్రయత్నంగా ఆగస్టు 21న పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాడని అనిరుధ్ తండ్రి
సాకేత్‌రామ్ అన్నారు.
''మా అబ్బాయి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్పెషలిస్ట్ పరీక్ష క్లియర్ చేసింది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు గుర్తించారు. అతి పిన్న వయసులో దీనిని సాధించిన బాలుడిగా సర్టిఫై చేశారు. నేను ఆఫీస్ పని చేసుకుంటుండగా గమనించి ఆసక్తి చూపేవాడు. తక్కువ శిక్షణతోనే నేర్చుకున్నాడు. స్పెషలిస్టు పరీక్షలో తొలి దశలో వెయ్యికి 540 మార్కుల నుంచి క్రమంగా 950 మార్కులకు చేరుకున్నాడు. ఇటువంటి కుమారుడు ఉండడం ఆనందంగా ఉంది.'' - సాకేత్‌రామ్, అనిరుధ్ తండ్రి.
ఆరేళ్ల వయసులో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్పెషలిస్ట్ ఉత్తీర్ణత సాధించడం ద్వారా అనిరుధ్ రికార్డు సృష్టించాడు. ఏడేళ్ల వయసులో ఒడిశాకు చెందిన బాలుడు పేరిట ఉన్న అత్యంత పిన్నవయసు రికార్డును అధిగమించి..ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించాడు. నాలుగేళ్ల వయసులోనే 160 సెకన్లలో 100 కార్ల పేర్లు చెప్పి రికార్డు సొంతం చేసుకున్నాడు. చిన్నారి ప్రతిభ పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.