చిత్తూరు జిల్లాలో నమోదవుతున్న కరోనా కేసుల్లో సగానికి పైబడి తిరుపతి నగరంలో నమోదవుతుండటంతో హడలిపోతున్న తిరునగర వాసులు...మరోవైపు అపరిశుభ్ర వాతావరణంతో సీజనల్ వ్యాధులు ప్రబలిపోతాయన్న ఆందోళనకు గురవుతున్నారు. గడిచిన మూడు సంవత్సరాలుగా స్వచ్ఛనగరాల్లో జాతీయ స్థాయిలో తొలి పది స్థానాల్లో చోటు సంపాదించుకున్న తిరుపతి నగరంలో ప్రస్తుతం పారిశుద్ధ్యం పడకేసింది. వర్షాకాలం వచ్చిందంటే చాలు తిరుపతి నగరవాసులు వణికిపోతున్నారు. పొంగి పొర్లే మురికికాలువలు నగర రహదారులను ముంచెత్తుతున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు పారిపోవడానికి తగినంత స్థాయిలో ఏర్పాట్లు లేకపోవడంతో వీధులు వర్షపునీటితో నిండిపోతున్నాయి.
వర్షం ఆగిపోయిన తర్వాత పేరుకుపోయిన మురికిని తాత్కాలికంగా తొలగించడం మినహా శాశ్వతంగా సమస్య పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం లేదని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి నగరంలోని సాయినగర్, రాఘవేంద్రనగర్, కేశవాయునిగుంట ప్రాంతాలను గడిచిన కొంత కాలంగా మజ్జిగ కాలువ ముంచెత్తుతోంది. వర్షపునీటితో పొంగిపొర్లే మజ్జిగ కాలువతో ఆయా ప్రాంతాల వీధులన్నీ మురికినీటితో నిండిపోతున్నాయి.
మురికి కాలువలు పొంగిపొర్లి రహదారులపైకి వచ్చి చేరుతున్న నీటితో వీధులన్నీ దుర్గంధంతో నిండిపోతున్నాయి. వర్షం వచ్చిందంటే చాలు ఇంటి బయటకు రాలేకపోతున్నామని స్థానికులు వాపోతున్నారు. వర్షాకాలంలో మురికి కాలువలు పొంగిపొర్లడం నగరంలో సర్వసాధారణమైందని....మజ్జిగ కాలువ సమస్యను అధికారులు దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కావడం లేదని చెబుతున్నారు.