నివర్ తుపాను.. అన్నదాతలను నిండా ముంచింది. కల్లోలం నుంచి కర్షకులు కోలుకోలేదు. చెరువులను తలపిస్తున్న పొలాలు చూసి తల్లడిల్లిపోతున్నారు. చేతికొచ్చిన పంట నీటిపాలైంది. వాగులు, వంకల ప్రవాహ ఉద్ధృతికి వ్యవసాయ బావులు, మోటార్లు కొట్టుకుపోయాయి. తుపాన్ నుంచి కోలుకోకముందే.. మరో తుపాను కారణంగా బుధవారం రాత్రి నుంచి జిల్లా అంతటా వానలు పడుతున్నాయి. చేతికొచ్చిన పంటను కాపాడులేకపోయామనే ఆవేదనతో పుంగనూరు మండలం మద్దనపల్లెకు చెందిన యువ కౌలురైతు కుమార్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకుంటుందన్న అన్నదాత ఎదురుచూపులకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. పంట నష్టం నమోదుపై అయోమయం నెలకొంది. కొన్ని చోట్ల రాజకీయ ప్రమేయం ఎక్కువైంది. పడమటి ప్రాంతాలైన పుంగనూరు, పీలేరు, చంద్రగిరి, తంబళ్లపల్లెలో రాజకీయ పెత్తనం అధికమైంది. సచివాలయ సిబ్బందిపై ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి. తాము చెప్పిన రైతుల వివరాలే నమోదు చేయాలంటూ హుకుం జారీ చేస్తున్నారు.
సిబ్బందిపై నమ్మకం లేక..
ఎర్రావారిపాలెం మండలం నెరబైలు పంచాయతీ బండమీద కమ్మపల్లె గ్రామ రైతులకు దడిగమ్మ చెరువు కింద పంట పొలాలున్నాయి. చెరువు నిండిపోయి మొరవ పారుతూ సమీపంలోని కుంట నిండి కట్ట తెగిపోయింది. 30 ఎకరాలు చేతికొచ్చిన వరి పంట కొట్టుకుపోయింది. నష్టాన్ని నమోదు చేయించుకోవడానికి సచివాలయ సిబ్బందిపై రైతులకు నమ్మకం లేక వ్యవసాయాధికారిని ఆశ్రయించారు. ఇక్కడ సచివాలయ సిబ్బంది కొందరు స్థానిక రాజకీయ నేతల కనుసన్నల్లో పని చేస్తుండడంతో నమ్మకం లేదని రైతులు తెలిపారు. పరిహారం అందుతుందనే భరోసా లేక ఆందోళన చెందుతున్నారు.
చెప్పినట్లు వినలేదని..
తాము చెప్పినట్లు వినలేదని పెద్దమండ్యం సచివాలయ ఓ ఉద్యోగిని జిల్లా సంక్షేమ కార్యాలయానికి సరెండర్ చేశారు. సంక్షేమ పథకాలకు అర్హులను అనర్హుల జాబితాలో చేర్చాలంటూ ఓ అధికారితోపాటు పాటు ఓ నేత ఒత్తిడి చేశారు.
నమోదులో నిబంధనలు