తిరుమలేశుని సన్నిధిలో.. ఆయన ఆశీస్సులతో వివాహ జీవితాన్ని ప్రారంభించాలని వధూవరులు ఎంతో ఆశపడతారు. నిత్య వధూవరులైన శ్రీదేవి, భూదేవీ సమేత మలయప్ప స్వామివారికి నిత్యం కల్యాణం నిర్వహించడం.. వేద మంత్రోచ్చరణలు, గోవింద నామస్మరణలు ఘోషించే.. దివ్యక్షేత్రంలో పెళ్లి జరిగితే.. సుఖసంతోషాలతో జీవించవచ్చనేది వారి విశ్వాసం. ఏడుకొండలవాడి సన్నిధిలో ఏటా ఏడువేలకు పైగా పెళ్లిళ్లు జరుగుతుంటాయి. పేదలతో పాటు సంపన్నులు కూడా వివాహ శుభకార్యాలు జరుపుకునేలా ఇక్కడ వసతులున్నాయి. ఎలాంటి రుసుములు వసూలు చేయకుండా.. పురోహిత సంఘంలో వివాహాలు నిర్వహిస్తారు. పురోహితుడితో పాటు.. బాజా భజంత్రీలను ఉచితంగా తితిదే కల్పిస్తోంది. నూతన దంపతులతో పాటు వారి తల్లితండ్రులకూ శ్రీవారి దర్శనం కల్పిస్తూ వస్తోంది. వివాహాలను ఘనంగా నిర్వహించాలనుకునే వారి కోసం.. తితిదే కల్యాణ మండపాలతో పాటు.. కొండపై ఉన్న మఠాలలోనూ సౌకర్యాలున్నాయి.
వేలాది వివాహాలతో కళకళలాడుతుండే ప్రాంతంలో.. కరోనా కారణంగా మార్చి నెల నుంచి వివాహాలు ఊసే లేదు. నూతన దంపతులు, బంధువులతో సందడిగా ఉండే పురోహిత సంఘం ఆరేడు నెలలుగా బోసిపోయింది. అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా వివాహాలు జరుపుకునేందుకు కొన్ని షరతులతో కేంద్రం మార్గదర్శకాలిచ్చినా.. పురోహిత సంఘంలో పెళ్లిళ్లు నిర్వహించుకునేందుకు తితిదే అనుమతి ఇవ్వడం లేదు. శ్రీవారి దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే పరిమిత సంఖ్యలో కొండపైకి అనుమతిస్తున్నారు. వివాహాలకూ అనుమతి ఇవ్వాలని భక్తులతో పాటు.. పెళ్లిళ్లు నిర్వహించే గుత్తేదారులు, సిబ్బంది కోరుతున్నారు.