ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సైబర్ కేటుగాళ్లతో జాగ్రత్త... ఆ లింకులు క్లిక్ చేయెుద్దు! - ఆన్​లైన్ మోసాలు

మనిషి ఆశాజీవి! కాకపోతే అత్యాశకు పోతేనే.. ఉన్నది కాస్తా పోతుంది! ఒకటి ఆశిస్తే.... ఇంకోటి జరుగుతుంది! సైబర్‌ మోసాల నుంచి నేర్వాల్సిన గుణపాఠం ఇదే...! మీకు లక్కీ డ్రా వచ్చిందనే లింకును అరక్షణం కూడా ఆగకుండా క్లిక్‌ చేస్తే.. అనర్థానికి దారి తీస్తుంది. అదే... ముక్కూమొహం తెలియని వాడు ఊరికే డబ్బెందుకు ఇస్తాడని.. ఒక్క నిమిషం ఆలోచిస్తే అగాధంలో పడకుండా కాపాడుతుంది! లాటరీలు, ఉచిత ఆఫర్ల పేరిట వచ్చే లింకులు, సందేశాలు.. సైబర్‌ మోసగాళ్లు పన్నే అంతర్జాల ఉచ్చులని సూచిస్తున్నారు నిపుణులు.

Do not click on cyber links and messages
సైబర్ మోసాలు

By

Published : Jan 5, 2021, 7:19 PM IST

సైబర్ మోసాలు

ఈ లింక్‌ క్లిక్ చేస్తే కోటి రూపాయల బంపర్ డ్రా మీదేనని.... వాట్సప్‌కు ఓ సందేశం వస్తుంది. మీరు పదివేలు కడితే.. పది లక్షల విలువైన గిఫ్ట్‌లు పంపిస్తామని మెయిల్‌ వస్తుంది..! స్క్రాచ్‌ కార్డు గీకండి.. సొమ్ము సొంతం చేసుకోండి అని ఫోన్‌కు..... మెసేజ్‌ వస్తుంది.! అంతర్జాలంలో ఏదో వెతుకుతుంటే ఏదో ఆకర్షిస్తుంది. ప్రత్యేక ఆఫర్‌లతో కూడిన.. స్పిన్ వీల్‌ ప్రత్యక్షమవుతుంది. నిజానికి ఇవన్నీ ఊరడించే ఆఫర్లు కాదు....! సైబర్ నేరగాళ్లు అమాయక నెటిజన్ల కోసం పన్నిన ఉచ్చులు. అయాచిత లాభం ఆశించేవాళ్లు.. కోరితెచ్చుకునే కష్టాల వలలు.! తెలియక...సైబర్‌ ఉచ్చులో చిక్కినవారు కొందరైతే... తెలిసి కూడా ఆత్రంగా క్లిక్‌ చేసి కష్టాల్లో పడినవారు చాలా మంది ఉన్నారు.

సైబర్ ఉచ్చులు ఎలా పన్నుతారంటే...

  • మోసపోయేవాళ్లున్నంతకాలం మోసగాళ్లు..... పుట్టుకొస్తూనే ఉంటారు. డిజిటల్‌ యుగంలో సైబర్‌ మాయగాళ్లు ఎక్కువైపోయారు. వారు గాలం వేయడానికి, మనం మోసపోవడానికి... అనేక మార్గాలున్నాయి. వాటిలో ఒకటి ఐడెంటెటీ థెఫ్ట్....! మోసపూరిత అంతర్జాల లింకులు... క్లిక్ చేస్తే జరిగే మొదటి నష్టం ఇదే. ఓ రకంగా చెప్పాలంటే... ఇది మన సెల్ ఫోన్లలోనో, కంప్యూటర్లలోనో చొరబడి వ్యక్తిగత వివరాలు కాజేసే ప్రక్రియ! మనకు తెలియకుండానే..... మన అభిరుచులు, అభిప్రాయాల దగ్గర నుంచి... బ్యాంకు ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌లు.... ఓటీపీల వరకూ అన్నీ నేరగాళ్ల చేతిల్లో పడటానికీ ఆస్కారం..దీని ద్వారానే ఎక్కువ. సామాజిక మాధ్యమాల్లో..... మనం పెట్టే పోస్టుల దగ్గర నుంచి అవగాహన లేకుండా.... ఓపెన్ చేసే లింకుల వరకూ ఐడెంటెటీ థెఫ్ట్ కావటానికి అనేక మార్గాలున్నాయి.
  • మోసగాళ్ల ఉచ్చులో రెండోది ట్రాకింగ్‌..! మనకు తెలియకుండానే తెరిచే లింకుల ద్వారా ఒక ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌ ప్యాకేజ్‌-యాప్​కే.... మన మొబైల్ ఫోన్‌లోనో, కంప్యూటర్‌లోనో ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఫలితంగా మనం చేసే ప్రతీ పనీ... మానిటరింగ్‌లోకి వెళ్లిపోతుంది. పాస్‌వర్డ్‌లను నిక్షిప్తం చేసుకోవటం దగ్గర నుంచి నేరగాళ్లకు మన సర్వర్ అనుసంధానించే వరకూ.. ఏరకంగానైనా అది ఉపయోగపడుతుంది. ఇంకేముంది....దొంగ చేతికి తాళం చెవి అందించినట్లే!
  • మనకు తెలియకుండా మనం మోసగాళ్ల బుట్టలో పడే మరో మార్గం ఫిషింగ్‌....! ఇది కూడా సమాచారాన్ని మోసపూరితంగా సేకరించే పద్ధతే. ఒక ఈ మెయిల్ లేదా... మెసేజ్ పంపటం ద్వారా సమాచారం సేకరిస్తారు. నకిలీ వెబ్ సైట్లు క్రియేట్ చేసి....వాటి ద్వారా యూజర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. కరోనా వ్యాక్సిన్ వేస్తామంటూ వివరాలు ఆరా తీసి... ఖాతాలు ఖాళీ చేయడం ఇప్పుడు సైబర్‌ నేరగాళ్ల కొత్త ట్రెండ్ అంటున్నారు పోలీసులు.

ఆఫర్ల పేరిట వల

పండుగ వేళ ఆఫర్లు, 500 రూపాయలకే ఐఫోన్లంటూ వచ్చే మెసేజ్‌లు.. మనల్ని బురిడీ కొట్టించే ఇంకో రకం ప్రయత్నాలు! ఆలసించిన ఆశాభంగం అనుకుని... ఆఫర్లకు అప్పటికప్పుడే స్పందిస్తే ఎరక్కపోయి ఇరుక్కున్నట్లేననే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకే వాడే బ్రౌజర్ల దగ్గర నుంచి యాప్‌ల డౌన్‌లోడ్‌ల వరకూ ప్రతీదీ అధీకృత సైట్ల నుంచే... కార్యకలాపాలు నిర్వహించాలి. వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాంలలో వచ్చే అనవసర మెసేజ్‌ల జోలికి పోకుండా.... స్వీయ నియంత్రణ పాటించాలి. ఎలాంటి సమస్య వచ్చినా సైబర్ మిత్ర సాయం తీసుకోవాలి. దగ్గర్లో ఉన్న.. సైబర్ పోలీస్ సెల్‌కి సమాచారం చేరవేయాలి.

అప్రమత్తతే శ్రీరామరక్ష

బ్యాంకులుగానీ.. ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే ఏ సంస్థలుగానీ మనకు నేరుగా లోన్లు ఇవ్వవు. పత్రాల పరిశీలన దగ్గర నుంచి చాలా పెద్ద ప్రక్రియే ఉంటుంది. ఈ విషయాన్ని గమనంలో ఉంచుకోవాలని నిపుణులు గుర్తుచేస్తున్నారు. అయాచిత లబ్ధి కోసం ఆశపడకుండా.. అప్రమత్తతతో వ్యవహరించడమే... ఆన్‌లైన్ మోసాల నుంచి శ్రీరామరక్ష అని సూచిస్తున్నారు.

ఇదీ చదవండి:

విశాఖ కాఫీ తోటల కథ...

ABOUT THE AUTHOR

...view details