రాష్ట్రంలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. వైకాపా నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. తిరుపతిలో నిర్వహించిన ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. వైకాపా అధికారంలోకి వచ్చాక అధికారులు పని చేయటం లేదని విమర్శించారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నా.. సీఎం జగన్మోహన్ రెడ్డి నోరు మెదపటం లేదన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ను ఆదర్శంగా తీసుకోని రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేయాలని హితవు పలికారు. దేశంలో న్యాయవ్యవస్థ మాత్రమే సక్రమంగా వ్యవహరిస్తోందని నారాయణ వ్యాఖ్యానించారు.
చిత్తూరు - తచ్చూరు జాతీయ రహదారి కోసం భూములు త్యాగం చేసిన రైతులకు పరిహారం ఇవ్వటంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నారాయణ ఆరోపించారు. ఖాళీ పత్రాలపై భూములు కోల్పోయిన రైతుల నుంచి బలవంతంగా సంతకాలు సేకరిస్తున్నారని విమర్శించారు. గ్రామ సభలు నిర్వహించి రైతుల అంగీకారంతో భూసేకరణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.