దీపావళి వచ్చిదంటే చాలు...ధన త్రయోదశి, దంతేరస్ పేరుతో బంగారం మొదలు పలు రకాల వస్తువులను కొనుగోలు చేయడం దశాబ్దాలుగా సాగుతున్న సంప్రదాయం. అవసరమైన వాటిని కొనుగోలు చేయకుండా సెంటిమెంట్‌తో దీపావళి పండగ వరకు వేచిచూసి కొనేవారు కొందరైతే... ఆఫర్లు ఆశపెడుతుంటే దుకాణాలకు పరుగులు తీసి కొనేవారు మరికొందరు. పండగ సెంటిమెంట్లు, ఆఫర్ల ఆశలు ఏవీ వినియోగదారున్ని దుకాణాల మెట్ల ఎక్కనీయడం లేదు. ఆశపెట్టే ఆఫర్లను వినియోగదారుల ముందుంచే వ్యాపార ధర్మం దూరమైంది. ఫలితంగా కరోనా నామ సంవత్సరంగా మారిన 2020 సంవత్సర దీపావళి సీజన్ వెలవెలపోతోంది.
గత ఏడాదితో పోలిస్తే కొన్ని వ్యాపారాలు పదిశాతానికి పరిమితమవ్వగా...మరికొన్ని చచ్చిచెడి నలభై శాతానికి చేరడమే పెద్ద విజయంగా భావిస్తున్నారు. కొన్ని వ్యాపారాలు అసలే బోనీ కాని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. వస్త్ర దుకాణాలు, బంగారు ఆభరణాల దుకాణాలు, గృహోపకరణాల షాపులు ఏవైనా....కరోనా బారిన పడి విలవిలాడుతున్నవే. కరోనా ప్రభావంతో ఎలాంటి ఆఫర్లు లేవు.
ఎలాంటి ఆఫర్లు, స్కీంలు లేకుండా...వినియోగదారులు దుకాణాల వైపు చూడకుండానే ఈ ఏడాది దీపావళి సీజన్ నామమాత్రపు వ్యాపారాలతో ముగిసిపోతోంది. దీపావళి సీజన్‌లో రాయలసీమలోని 400 వందల గృహోపకరణాల దుకాణాల్లో ఐదు వందల కోట్ల రూపాయల వరకు వ్యాపారం జరుగుతుందన్న అంచనా. కరోనా ప్రభావంతో ఈ ఏడాది గృహోపకరణాల వ్యాపారం పూర్తిగా తగ్గిపోయింది. నలభై శాతం మేర కూడా వ్యాపారాలు సాగలేదన్న అభిప్రాయం వ్యాపారుల్లో వ్యక్తమవుతోంది.