జగన్.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేపట్టి ఇవాళ్టితో మూడేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వైకాపా శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో మూడేళ్ల వేడుకలు చేసుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి.. తన కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులతో ఆనందం పంచుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 96 శాతం అమలు చేశామని మంత్రి ఉద్ఘాటించారు. వచ్చే ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. గడప గడపకు ప్రభుత్వం, సామాజిక న్యాయభేరి కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందన్నారు.
అనకాపల్లి జిల్లా చోడవరంలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సంబరాలను ప్రారంభించారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించిన అనంతరం.. కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలవ్యాప్తంగా.. వైకాపా శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. పార్వతీపురంలో ఎమ్మెల్యే జోగారావు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. వీరఘట్టంలో వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించారు. విజయనగరం జిల్లా గజపతినగరం, నెల్లిమర్లలో ఎమ్మెల్యేలు అప్పలనరసయ్య, అప్పలనాయుడు ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. విజయనగరంలో ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి.. చీరలు పంపిణీ చేశారు.