ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులను అధికార పార్టీ నేతలు ఇబ్బందులు పెడుతున్నారని చిత్తూరు, తిరుపతిలలో నిరసన తెలిపేందుకు వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబును పోలీసులు నిర్బంధించడం ఆ రాష్ట్రంలో కలకలం సృష్టించింది. సోమవారం ఉదయం 9.30 గంటల సమయంలో రేణిగుంట విమానాశ్రయంలో దిగిన చంద్రబాబును నిరసన తెలిపేందుకు అనుమతి లేదంటూ పోలీసులు నిర్బంధించారు. మీడియాతో మాట్లాడటానికీ అవకాశమివ్వలేదు. దీంతో ఆగ్రహించిన తెదేపా అధినేత దాదాపు 10 గంటలపాటు విమానాశ్రయంలోనే బైఠాయించారు. తనను ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలని పోలీసు అధికారులను నిలదీశారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు లేదా అంటూ మండిపడ్డారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశా.. ప్రతిపక్ష నేతగా ఉన్నా. నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పండంటూ అధికారులను నిగ్గదీసి అడిగారు. చంద్రబాబును ఎలాగైనా అక్కడి నుంచి పంపించాలని అధికారులు పలుమార్లు ప్రయత్నించారు. పలువురు ఉన్నతాధికారులు వచ్చి ఆయనను అక్కడి నుంచి తిరిగివెళ్లాలని ఒత్తిడి చేశారు.ఎట్టకేలకు పోలీసు అధికారులు రాత్రి 7.15 గంటల సమయంలో ఆయనను విమానం ఎక్కించి హైదరాబాద్‌కు పంపారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన ఈ ఆందోళనతో రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. చిత్తూరు, తిరుపతి, విజయవాడ తదితర ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించాయి.
మున్సిపల్ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థుల ఆస్తులను వైకాపా కార్యకర్తలు ధ్వంసం చేయడం, దుకాణాలు తొలగించడం వంటి ఘటనల నేపథ్యంలో బాధితులను పరామర్శించడంతోపాటు చిత్తూరు, తిరుపతిలలో నిరసన తెలియజేసేందుకు చంద్రబాబు సోమవారం హైదరాబాద్ నుంచి రేణిగుంట వచ్చారు. ఉదయం 9.30 గంటలకు ఆయన విమానం దిగి టెర్మినల్‌లోకి రాగానే.. నిరసనలు చేపట్టేందుకు అనుమతి లేదంటూ పోలీస్ అధికారులు అడ్డుకున్నారు. దీంతో చంద్రబాబు అక్కడే నేలపై బైఠాయించి నిరసన తెలియజేశారు. ‘తిరుపతిలో అనేక సమావేశాలు నిర్వహించారు. శ్రీవారిని దర్శించుకునేందుకు రోజూ 55 వేల మంది వరకు వస్తున్నారు. ఇప్పుడు నాకు నోటీసు ఎందుకిచ్చారు? నేను రావడానికి అనుమతి కావాలా? ఇది దౌర్జన్యం కాదా? జిల్లా కలెక్టర్‌ను కలిసేందుకు నాకు హక్కు లేదా? నేను హత్య చేసేందుకు వెళ్తున్నానా? మీరు అనుమతి నిరాకరించారు కాబట్టి ఇక్కడే కూర్చుని నిరసన తెలియజేస్తా. నేను ఎందుకు వచ్చానో ప్రజలకు తెలియాలి. జిల్లా కలెక్టర్‌తోపాటు చిత్తూరు, తిరుపతి అర్బన్ ఎస్పీలకు ఈ విషయం చెప్పండి.కాదనుకుంటే నన్ను అరెస్టు చేసి తీసుకెళ్లండి, కొట్టండి’ అని అధికారులపై నిప్పులు చెరిగారు.
మధ్యాహ్న సమయంలో తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు, ఆర్డీవో కనక నరసారెడ్డి విమానాశ్రయానికి చేరుకుని చంద్రబాబుతో చర్చించారు. తనను నిర్బంధించడానికి కారణాలు తెలియజేయాలని ఆయన వారిని డిమాండ్ చేశారు. చిత్తూరు ఎస్పీ రావాలని స్పష్టం చేశారు. అనంతరం ఆయన అంతర్జాతీయ లాంజ్‌లోకి వెళ్లి కూర్చున్నారు. ఆ తర్వాత చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్, సంయుక్త కలెక్టర్ (అభివృద్ధి) వీరబ్రహ్మం విమానాశ్రయానికి వచ్చి చంద్రబాబుతో చర్చించారు. ఆయన్ను తిరిగి వెళ్లాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా ఆయనకు పోలీసులు నోటీసు అందజేశారు.
కొవిడ్ ముప్పుందని నోటీసు