తిరుపతిలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన కార్యవర్గ సమావేశం జరిగింది. ఇందులో కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యులు మురళీధరన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో భాజపా అధికారం చేపట్టడానికి ఎంతో దూరం లేదన్నారు. త్వరలో జరిగే తిరుపతి ఉప ఎన్నికలో సోము వీర్రాజు నేతృత్వంలో పార్టీ సత్తా చాటుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో అవినీతిని ఎత్తిచూపుతూ, అసమర్థ పాలనను వ్యతిరేకిస్తూ ప్రజా సమస్యలపై ఉద్యమించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దృశ్య మాధ్యమం ద్వారా మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ మాట్లాడుతూ.. కేంద్రం నిధుల సాయం చేస్తుంటే జగన్ తన పేరు పెట్టుకుని మాయ చేస్తున్నారని విమర్శించారు. రానున్న సాధారణ ఎన్నికల్లో రాయలసీమ అభివృద్ధి భాజపా ప్రధాన అజెండాగా ఉంటుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ఇళ్ల స్థలాల కోసం భూసేకరణకు ఖర్చు చేసిన రూ.7 వేల కోట్లలో రూ.3 వేల కోట్ల అవినీతి జరిగిందని విమర్శించారు. ఇటీవల మరణించిన పార్టీ నేతలతో పాటు వైకాపా ఎంపీ దుర్గాప్రసాద్‌రావు మృతికి సమావేశంలో సంతాపం తెలిపారు. దృశ్య మాధ్యమం ద్వారా పురందేశ్వరి, రాజ్యసభ సభ్యులు సురేష్‌ప్రభు పాల్గొన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల సహ బాధ్యులు సునీల్ దేవధర్, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, ఎమ్మెల్సీలు మాధవ్, వాకాటి నారాయణరెడ్డి, నేతలు కన్నా లక్ష్మీనారాయణ, చిలకం రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
3 చోట్ల కిసాన్ జాగరణ్
వ్యవసాయ చట్టాలపై రైతులకు వాస్తవాలను వివరించాలని, దేశ వ్యాప్తంగా 100 ప్రాంతాల్లో ‘కిసాన్ జాగరణ్’ పేరిట రైతు ర్యాలీలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఈనెల 14న గుంటూరు, 17న విశాఖపట్నం పాయకరావుపేట, 19న నంద్యాలలో నిర్వహించాలని తీర్మానించింది.