ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CPS: సీపీఎస్‌ రద్దు చేస్తారా..? గద్దె దిగుతారా..?? : యూటీఎఫ్​

APUTF Meeting at Tirupati: 'సీపీఎస్‌ రద్దు చేస్తారా.. గద్దె దిగుతారా?' అంటూ ఉపాధ్యాయ సంఘాలు తిరుపతిలో నినదించాయి. పాదయాత్రలో జగన్‌ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్​ను వెంటనే రద్దు చేయాలని నేతలు డిమాండ్‌ చేశారు. తిరుపతిలో జరిగిన సదస్సులో సీపీఎస్‌ రద్దు పోరాట కార్యాచరణను ప్రకటించారు.

APUTF Meeting at Tirupati
తిరుపతిలో సీపీఎస్‌ ఉద్యోగుల సదస్సు

By

Published : Apr 3, 2022, 8:08 PM IST

తిరుపతిలో సీపీఎస్‌ ఉద్యోగుల సదస్సు

APUTF Protest Over CPS: పీఆర్సీ తరహాలో అరకొర పరిష్కారాలను సహించబోమని.. సీపీఎస్​ను పూర్తిస్థాయిలో రద్దు చేసే వరకూ పోరాటం ఆగబోదని ఉపాధ్యాయ సంఘాలు స్పష్టంచేశాయి. సీపీఎస్‌ రద్దుకు ఉద్యమ కార్యాచరణపై తిరుపతిలో యూటీఎఫ్​ రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు నగరంలోని కృష్ణాపురం ఠాణా నుంచి పాత తిరుచానూరు రహదారి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్‌ రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానం ప్రవేశపెడతామని ప్రకటించిన జగన్​.. మూడు సంవత్సరాలు గడచినా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. సీపీఎస్ రద్దు చేయాల్సిందేనన్న నేతలు.. 'సీపీఎస్‌ రద్దు చేస్తారా-గద్దె దిగుతారా?' అంటూ నినదించారు.

సీపీఎస్‌ రద్దు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి కార్యాచరణ ప్రకటించారు. ఈ నెల 4 నుంచి 24 వరకు వివిధ స్థాయిల్లో నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నెల 17న రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల నుంచి మోటారు బైక్‌ జాతా(ర్యాలీ) ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. శ్రీకాకుళం, విజయనగరం, చిత్తూరు, అనంతపురం నుంచి వచ్చే జాతా.. 24 నాటికి విజయవాడకు చేరతాయని తెలిపారు. ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా.. నెరవేర్చలేదని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాట తప్పని.. మడప తిప్పని వంశమంటూ గొప్పలు చెప్పుకొనే ముఖ్యమంత్రి జగన్‌... సీపీఎస్‌ రద్దుపై అనుసరిస్తున్న విధానాన్ని ఏమంటారని ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, షేక్​ సాబ్జి ప్రశ్నించారు. రాజస్థాన్‌ తరహాలో పాత పింఛన్‌ విధానాన్ని తీసుకురావాల్సిందేనని స్పష్టంచేశారు. సీపీఎస్‌ రద్దు చేయకపోతే ఈ నెల 24 తర్వాత ర్యాలీలు, సభలు ఉండవన్న నేతలు.. ఉద్యమం మరో స్థాయిలో సాగుతుందని స్పష్టం చేశారు.

తరిమి కొట్టాల్సిన సమయం వచ్చింది: నేను విన్నాను.. చూశాను.. ఉన్నాను.. అన్న వ్యక్తి ఇప్పడు ఎక్కడ ఉన్నారని సదస్సుకు హాజరైన పీడీఎఫ్​​ నేతలు ప్రశ్నించారు. సీపీఎస్‌ రద్దుకు ప్రభుత్వం రోడ్డు మ్యాప్‌లు సిద్ధం చేస్తుంటే.. సీపీఎస్‌ ఉద్యోగులు రోడ్లు ఎక్కి ఉద్యమాలు చేస్తారన్నారు. మాటతిప్పి మడపతిప్పిన వ్యక్తిని తరిమి కొట్టాల్సిన సమయం వచ్చిందన్నారు.

ఇదీ చదండి:చెత్త పన్ను కట్టలేదని.. పింఛన్ డబ్బు కత్తిరించారు..!

ABOUT THE AUTHOR

...view details